BRS Vs Congress: చర్చకు సై… బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం..!!

తెలంగాణలో (Telangana) అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం ముదిరింది. నీటిపారుదల రంగం, రైతు సంక్షేమంపై బీఆర్ఎస్ (BRS) చెప్తున్నవన్నీ అబద్దాలేనని, దీనిపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (KTR) ఘాటుగా స్పందించారు. దీనిపై చర్చించేందుకు కేసీఆర్ అవసరం లేదని, తాము చాలన్నారు. ప్రెస్ క్లబ్ లో 8వ తేదీ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేటీఆర్ సవాల్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పందించి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ ఉండగా ప్రెస్ క్లబ్ ఎందుకు.. అక్కడికే రండి అని సవాల్ విసిరారు. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది.
బనకచర్ల (Banakacherla), కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టులు, రాష్ట్ర నీటి హక్కులపై శాసనసభలో బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు (Harish Rao) సవాల్ విసిరారు. దీనిపై ఇవాళ కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. “రేవంత్ రెడ్డి, నీవు ఎప్పుడు, ఎక్కడ చర్చ పెట్టినా మేము సిద్ధం. 72 గంటలు సమయం తీసుకుని ప్రిపేర్ అయి రా.. లేకపోతే బేసిన్లు, బెండకాయలు అంటూ ఇజ్జత్ పోతుంది” అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈనెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో చర్చకు రావాలని, అక్కడ రేవంత్ కోసం కుర్చీ సిద్ధంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. కొండారెడ్డిపల్లెలో కూడా చర్చకు తాము సిద్ధమని.., స్థలం, సమయం, తేదీని రేవంత్ ఇష్టానుసారం ఎంచుకోవచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎరువుల సరఫరాలో విఫలమైందని, రేవంత్ రెడ్డికి బేసిక్ జ్ఞానం లేదని విమర్శించారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. “కేటీఆర్ సవాలుకు మేము సిద్ధం. ఆయనకు ఇటీవల దేశంలో లేకపోవడం వల్ల సమాచారం లేదేమో” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై శాసనసభలో అర్థరాత్రి వరకు చర్చ జరిగిందని, బనకచర్ల విషయంలో కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. “ప్రెస్ క్లబ్‌లో చర్చకు సిద్ధమని కేటీఆర్ అంటున్నారు. అయితే, ప్రతిపక్ష నాయకుడిని శాసనసభకు రమ్మనండి, సభ పెడతాం,” అని పొన్నం సవాల్ విసిరారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌తో చేసుకున్న ఒప్పందాలు ఓపెన్ సీక్రెట్‌గా ఉన్నాయని, చర్చలకు తాము ఎప్పుడూ భయపడబోమని స్పష్టం చేశారు. శాసనసభలో అధికారికంగా, రికార్డ్ పై చర్చించాలని పొన్నం సూచించారు.
బనకచర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. చంద్రబాబు సూచనల మేరకు రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని చెప్తోంది. దీనిపై కాంగ్రెస్ గట్టిగా కౌంటర్ ఇస్తోంది. నాడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏపీ ప్రభుత్వంతో నడిపిన రహస్య చర్చలు అందరికీ తెలుసన్నారు. కేసీఆర్ హయాంలో ఏపీతో పడిన లాలూచీపై చర్చించేందుకు సిద్ధమని కాంగ్రెస్ అంటోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది.