Banakacharla – BRS: బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అభ్యంతరాలేంటి..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) చేపట్టిన గోదావరి-బనకచర్ల ఎత్తిపోతల పథకం (Godavari-Banakacherla Link Project) తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదానికి కొత్త రూపాన్ని ఇచ్చింది. ఈ పథకం ద్వారా సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి (Godavari) నీటిని రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలకు ఎత్తిపోసి ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ ప్రాజెక్టుపై తెలంగాణలోని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (BRS) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, రాజకీయ విమర్శలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఈ వివాదం తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది.
గోదావరి-బనకచర్ల పథకం ఆంధ్రప్రదేశ్‌లోని కరువు పీడిత ప్రాంతాలకు నీటిని అందించేందుకు రూపొందించిన రూ. 80,000 కోట్ల మెగా ప్రాజెక్టు. ఈ పథకం ద్వారా మొదటి దశలో 200 టీఎంసీల నీటిని, రెండో దశలో 400 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ప్రణాళిక ఉంది. సముద్రంలోకి వృథాగా పోతున్న అదనపు గోదావరి నీటిని మాత్రమే ఉపయోగించుకుంటామని, తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. అయినా, బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా మాజీ ఇరిగేషన్ మంత్రి టి. హరీశ్ రావు, ఈ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగిస్తుందని ఆరోపిస్తున్నారు. గోదావరి జలాల్లో తెలంగాణకు 959 టీఎంసీ హక్కు ఉండగా, ఈ ప్రాజెక్టు ఆ హక్కును కాలరాస్తుందని వారు వాదిస్తున్నారు.
బీఆర్ఎస్ నాయకత్వం ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్తబ్దుగా ఉన్నారంటూ తీవ్రంగా విమర్శిస్తోంది. హరీశ్ రావు ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి అఖిల పక్ష సమావేశం లేదా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక, ఈ ప్రాజెక్టుకు కేంద్రం 50% నిధులు ఇస్తోందని.. FRBM నిబంధనలను సైతం సడలిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు మద్దతు ఇస్తోందని ఆరోపించారు. అదే సమయంలో తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడంలో వివక్ష చూపుతోందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చట్టవిరుద్ధంగా, గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్ (GWDT) అనుమతులు లేకుండా ముందుకు తీసుకెళ్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది.
మరోవైపు, తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కేంద్రానికి, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్‌కు 13 లేఖలు రాశామని, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరామని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో కృష్ణా నది నీటి పంపకంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ముచ్చుమర్రి, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను అడ్డుకోలేకపోయారని ఉత్తమ్ రెడ్డి ఆరోపించారు.
ఈ వివాదంలో రాజకీయ కోణం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతానికి గోదావరి నీటిని అందించేందుకు సహకరిస్తామని, రాజకీయ వ్యతిరేకత లేకుండా సహాయం చేస్తామని చెప్పారు. అయితే, ఇప్పుడు అదే రాయలసీమ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టును చేపట్టగానే బీఆర్ఎస్ వ్యతిరేకత వ్యక్తం చేయడం రాజకీయ లబ్ధి కోసమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ ఈ విషయాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోందని ఆరోపణలు ఉన్నాయి.