Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…!

బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) శనివారం అరెస్ట్ అయ్యారు. వరంగల్ సుబేదారి పోలీసులు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Samshabad Airport) ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డిని బెదిరించి డబ్బులు వసూలు ఘటనలో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఘటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నేతలు దీనిని రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆరోపిస్తున్నారు.
కమలాపూర్ మండలం వనగపల్లిలో గ్రానైట్ క్వారీని నిర్వహిస్తున్న మనోజ్ రెడ్డిని ఎమ్మెల్యే పాడి కౌశిక రెడ్డి బెదిరించి డబ్బులు వసూలు చేశారంటూ ఆయన భార్య రమాదేవి సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. క్వారీ వల్ల స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి, కౌశిక్ రెడ్డి రూ.25 లక్షలు వసూలు చేసి, మరో రూ.50 లక్షలు డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 308(2), 308(4), మరియు 352 కింద కేసు నమోదైంది.
ఈ కేసును కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే, జూన్ 17న జస్టిస్ కే.లక్ష్మణ్ ఈ పిటిషన్‌ను తిరస్కరించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే అధికారుల ద్వారా పరిష్కరించాల్సింది పోయి.. నేరుగా వ్యాపారిని బెదిరించడం సరైనది కాదని కోర్టు పేర్కొంది. అంతేకాక, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే ఇంటరిమ్ ఆర్డర్‌ను కూడా రద్దు చేసింది. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు మార్గం సుగమమైంది.
శనివారం తెల్లవారుజామున విదేశాలకు వెళ్లేందుకు పాడి కౌశిక్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ కావడంతో కౌశిక్ రెడ్డిని ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్ సుబేదారి పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకుని హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
కౌశిక్ రెడ్డి అరెస్ట్ ను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈ అరెస్ట్ అక్రమమని, అప్రజాస్వామికమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని, ప్రభుత్వ అవినీతి, అవకతవకలను కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నందుకే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, న్యాయస్థానంలో అవి నిలబడవని చెప్పారు. బీఆర్ఎస్ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఈ అరెస్ట్ ను ఇందిరాగాంధీ కాలం నాటి ఎమర్జెన్సీతో పోల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను పక్కనపెట్టి, ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసులతో వేధిస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనలు చేపట్టగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.