BRS–Kaleswaram: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్.. బీఆర్ఎస్ కౌంటర్ చేయగలిగిందా..?

తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (Kaleswaram Project) చుట్టూ రాజకీయం కొనసాగుతోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh Commission) ఇటీవల తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలు, డిజైన్ సమస్యలకు నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (KCR) ప్రత్యక్షంగా, ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) పరోక్షంగా బాధ్యులని స్పష్టం చేసింది. ఈ నివేదిక బీఆర్ఎస్‌ను (BRS) రక్షణాత్మక స్థితిలోకి నెట్టింది. దీనికి కౌంటర్ గా హరీష్ రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలు పన్నుతోందని వాదించారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, నిర్వహణలో తీవ్ర లోపాలు ఉన్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, ఆర్థిక అక్రమాలు జరిగాయని తేల్చింది. నిపుణుల కమిటీ సూచనలను కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని, తద్వారా ప్రాజెక్టు వైఫల్యానికి దారితీసినట్లు నివేదిక పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగడం, 2022, 2023లో వరదల సమయంలో నిర్మాణ లోపాలు బయటపడడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చాయి. అంచనా వ్యయం రూ.80,190 కోట్లుగా ఉండగా, రూ.94,000 కోట్లు ఖర్చయ్యాయని, ఇందులో అవినీతి జరిగినట్లు కమిషన్ పేర్కొంది.
హరీష్ రావు తన ప్రజెంటేషన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టును “తెలంగాణ కల్పతరువు”గా అభివర్ణించారు. దీని వల్ల 35 శాతం భూమికి సాగునీరు అందిందని, నిర్మాణంలో నాణ్యతా లోపాలు లేవని వాదించారు. మేడిగడ్డలో 85 పిల్లర్లలో కేవలం రెండు మాత్రమే కుంగాయని, ఇది ప్రాజెక్టు వైఫల్యం కాదని, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ మేడిగడ్డను నిర్మాణ స్థలంగా ఎంపిక చేసిందని, కేబినెట్ ఆమోదంతోనే నిర్ణయాలు తీసుకున్నామని వాదించారు. కమిషన్ నివేదికను ట్రాష్ గా, రాజకీయ కుట్రగా అభివర్ణించారు. 665 పేజీల నివేదికలో కేవలం 60 పేజీలను లీక్ చేసి కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఈ నివేదికను విడుదల చేయడం వెనుక కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు ఉందని హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
బీఆర్ఎస్ వాదనల్లో కొంతవరకు నిజముంది. ఇందుకు కొన్ని ఆధారాలను కూడా హరీశ్ రావు చూపించారు. కేంద్ర సంస్థ వాప్కోస్, కేబినెట్ ఆమోదం వంటి విషయాలను డాక్యుమెంట్‌లను చూపించి వాదించడం ఆ పార్టీకి బలం చేకూర్చింది. అయితే, మేడిగడ్డలో లోపాలు, నిపుణుల సూచనలను పట్టించుకోకపోవడం వంటి ఆరోపణలకు స్పష్టమైన సమాధానం హరీశ్ రావు చెప్పలేకపోయారు. కమిషన్ 17 మంది అధికారులు, ఇంజనీర్ల నుంచి సేకరించిన సాక్ష్యాలు కేసీఆర్, హరీష్‌లపై ఆరోపణలకు బలం చేకూర్చాయి. హరీష్ రావు లక్ష కోట్ల అవినీతి ఆరోపణను గోబెల్స్ ప్రచారంగా వ్యాఖ్యానించినప్పటికీ, అంచనా వ్యయం కంటే ఎక్కువ ఖర్చు, నాణ్యతా లోపాలపై స్పష్టత ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ రాజకీయ కుట్ర ఆరోపణలు కొంత నిజమైనప్పటికీ, నివేదికలోని సాంకేతిక, ఆర్థిక లోపాలను బీఆర్ఎస్ పూర్తిగా ఖండించలేకపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నివేదికలోని అంశాలను ఇందుకు ఆధారంగా చూపుతున్నారు. కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయాలే ఈ వైఫల్యానికి కారణమని విమర్శించారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరపుతామని ప్రకటించింది. కేసీఆర్ సభకు రావాలని కోరింది.
కాళేశ్వరం కమిషన్ నివేదిక తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపింది. బీఆర్ఎస్ వాదనలు రాజకీయంగా బలంగా ఉన్నప్పటికీ, సాంకేతిక, ఆర్థిక ఆరోపణలను పూర్తిగా తిప్పికొట్టలేకపోయాయి. అసెంబ్లీలో చర్చ, పూర్తి నివేదిక బహిర్గతం కావడం ద్వారా ఈ వివాదంలో సత్యాసత్యాలు స్పష్టం కావచ్చు. ప్రస్తుతానికి, ఈ రిపోర్ట్ రాజకీయ ఆయుధంగా మారినట్లు కనిపిస్తోంది. కానీ నిజాలు బయటకు రావాలంటే మరింత పారదర్శకత అవసరం.