మానవ రహిత విమానం వచ్చేసింది

నిట్ట నిలువుగా టేకాఫ్ తీసుకోవడంతో పాటు, భూమి మీదకు దిగే సామర్థం ( వీటీఓఎల్) ఉన్న మావన రహిత సరుకు రవాణా విమానాన్ని బ్లూజే ఏరోస్పేస్ ఆవిష్కరించింది. దీని పనితీరును హైదరాబాద్ సమీపంలోని నాదర్‌గుల్ ఎయిర్‌ఫీల్డ్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించింది. వాణిజ్య స్థాయిలో పూర్తి విమానాన్ని 2026 నాటికి సిద్ధం చేయనున్నట్లు బ్లూజే ఏరో సహ వ్యవస్థాపకులు అమర్‌దీప్ శ్రీ వత్సవాయ, ఉత్తమ్ కుమార్ తెలిపారు. 100 కిలోల బరువును 300 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉందని పేర్కొన్నారు. సరకు రవాణాలో ఇది ఎంతో కీలకంగా మారుతుందన్నారు.
హైదరాబాద్ నుంచి వరంగల్‌ను 30 నిమిషాల వ్యవధిలో చేరగలదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు సేవలు అందించేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. 2026 నాటికి హైడ్రోజన్-విద్యుత్ ప్రొపెల్సన్‌తో అటానమస్ ఫ్లైట్ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. అప్పుడే మనుషులను తీసుకెళ్లే వీటీఓఎల్ విమానాన్నీ ఆవిష్కరించబోతున్నట్లు వివరించారు. దీనివల్ల విమానాశ్రయాలు లేని ప్రాంతాలకూ, విమాన సేవలను అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.