Raja Singh: రాజాసింగ్ క్రమశిక్షణా రాహిత్యం పరాకాష్టకు చేరింది: బీజేపీ సీరియస్

తెలంగాణ బీజేపీలో (BJP) రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటనతో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ కీలక నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి (Kishan Reddy) ఆయన పంపిన లేఖలో చేసిన ఆరోపణలు కూడా సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర బీజేపీ అధిష్టానం స్పందించింది. రాజాసింగ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేసింది. రాజాసింగ్ క్రమశిక్షణా రాహిత్యం పరాకాష్టకు చేరిందని తీవ్రంగా మండిపడింది. ఒకవేళ రాజాసింగ్ (Raja Singh) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని హితవు పలికింది. బీజేపీ నాయకులకు, వ్యక్తులకు కాకుండా కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తుందని గుర్తుచేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నామని బీజేపీ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం ఒక వ్యక్తిని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని, సరైన వ్యక్తికి బాధ్యతలు అప్పగించకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాజాసింగ్ (Raja Singh) తన లేఖలో ఆందోళన వ్యక్తంచేశారు. “నావాడు, నీవాడు” అనే ధోరణితో నియామకాలు చేయకూడదని పలువురు హితవు పలికారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని ఆయన డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా తనను అడ్డుకున్నారని కూడా రాజాసింగ్ ఆరోపణలు చేయడం రాష్ట్ర బీజేపీ వర్గాల్లో వివాదాలకు కేంద్రబిందువైంది.