Telangana: తెలంగాణలో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి..ఇది సాధ్యమేనా?

రాజకీయాల్లో ఏ మార్పు ఎప్పుడు జరుగుతుందో చెప్పడం కష్టం. సమయం, పరిస్థితులు అనేక నిర్ణయాలను తీసుకునేలా చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడొక ఆసక్తికర చర్చ తెలంగాణ (Telangana) రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా పని చేసిన బీజేపీ (BJP), జనసేన (Janasena), టీడీపీ (TDP) కూటమి ఇప్పుడు తెలంగాణలో కూడా కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందా? అనే అంశం చర్చకు దారితీస్తోంది. గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మిత్రపక్షాలు కలసి పోటీ చేసి విజయవంతమయ్యాయి. 164 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చాయి. ఇప్పటికీ ఈ కూటమిలో ప్రత్యేకంగా చెప్పదగిన విభేదాలు కనిపించడం లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తరచూ ఈ కూటమి 15 సంవత్సరాలు కొనసాగుతుందని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజా మీడియా కథనాల్లో తెలంగాణలో కూడా ఈ మూడు పార్టీల కలయికపై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ఉన్న బలాన్ని గమనిస్తే, జనసేన, టీడీపీ వంటి పార్టీల మద్దతు ఉంటే బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీకి ఇప్పటికీ హైదరాబాద్ (Hyderabad) పరిసరాల్లో వ్యాపార వర్గాలు, సెటిలర్ వర్గాల్లో మద్దతు ఉంది. జనసేన యువతను ఆకర్షించగలదు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి వీరు సహకరిస్తే పోటీ గట్టిగా నిలబడే అవకాశం ఉంది.
ఇక కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్టు అంచనాలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వలన కాంగ్రెస్ విజయం సాధించినా, మళ్లీ ప్రజలు కొత్త ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటే ఈ కూటమికే అవకాశం దక్కవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఇది ఇప్పుడు మాత్రమే ఊహగానమే.
ఇక అసలు ప్రశ్న ఏమిటంటే, తెలంగాణలో టీడీపీ, జనసేనలను బీజేపీ నిజంగా భాగస్వాములుగా తీసుకుంటుందా? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రత్యేకించి ఇవి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్టీలుగా గుర్తింపు పొందిన నేపథ్యంలో బీజేపీ నిర్ణయం కీలకం కానుంది. అయినప్పటికీ, వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అప్పటికి రాజకీయం ఎలా మలుపుతిరుగుతుందో, ఈ కూటమి వాస్తవంగా తెలంగాణలో నిలబడతుందా అన్నది ఆసక్తిగా మారింది.