1,800 కోట్ల పెట్టుబడితో బయోలాజికల్-ఈ భారీ విస్తరణ
ప్రముఖ ఫార్మా సంస్థ బయోలాజికల్-ఈ (బీఈ) భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. జీనోమ్ వ్యాలీలో మరో రూ.1,800 కోట్ల పెట్టుబడితో కొత్తగా 3 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. జనరిక్ ఇంజెక్ట్బుల్స్, వ్యాక్సిన్ల తయారీ, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకోసం ఏర్పాటుచేసే ఈ కేంద్రాల్లో 2,518 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది. ఈ మేరకు బయోలాజికల్-ఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల ప్రగతిభవన్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పాటు చేసే కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్, ఎంఆర్ వ్యాక్సిన్, పీసీవీ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, ఐపీవీ వ్యాక్సిన్, పెర్టుసిన్ వ్యాక్సిన్, టెటానస్ టాక్సైడ్ ఆంపుల్స్, బయోలాజికల్ ఏపీఐలు, ఫార్ములేషన్లు, ప్రత్యేక జనరిక్ ఇంజెక్ట్బుల్స్ తయారు చేయనున్నట్టు వివరించారు.
జీనోమ్ వ్యాలీలో బయోలాజికల్-ఈ కార్యకలాపాల విస్తరణ ప్రణాళిక పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా ఉన్న హైదరాబాద్‌కు ఉన్న ఖ్యాతి బీఈ ప్రణాళికతో మరింత ఇనుమడిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలతో ఎన్నో కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని మహిమా దాట్ల ప్రశంసించారు. దీంతో కొవిడ్ సంక్షోభ సమయం లోనూ తమ సంస్థ విస్తరణకు శీఘ్ర నిర్ణయాలు తీసుకొన్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు లభిస్తున్న సహకారంపై సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణకు రూ.1800 కోట్ల మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్-ఈ.. జీనోమ్ వ్యాలీలోని తమ ప్లాంట్ విస్తరణకు ఈ మొత్తాన్ని ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ‘‘బయోలాజికల్-ఈ విస్తరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీంతో ఏడాదికి 14 బిలియన్ డోస్‌ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే ఏకైక ప్రాంతంగా హైదరాబాద్ మారింది. ఇప్పటికే హైదరాబాద్‌కు ‘‘వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’’గా పేరున్నది, ఈ విస్తరణ మన బలాన్ని మరింత పెంచింది’’ అని మంత్రి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.






