Bhatti Vikramarka : ఐదేళ్లలో వారికి రూ.లక్ష కోట్ల రుణాలు : డిప్యూటీ సీఎం భట్టి

అవకాశం ఉన్న ప్రతిచోట మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ప్రజాభవన్ (Praja Bhavan)లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఆర్టీసీకి అద్దె బస్సులు అందించిన మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. తొలి నెల అద్దె కింద రూ.1.49 కోట్లు ఆయా సంఘాలకు మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), సీతక్క అందించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా ఉంటుందని చెప్పారు. మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించేందుకు ప్రోత్సహిస్తున్నామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులనే చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఐదేళ్లలో వారికి రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనేది లక్ష్యమన్నారు. ఈ నెల 8న అన్ని మండలాల్లో ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించాలి. మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న లబ్ధి గురించి చర్చించాలి. గ్రామాలు, మండలాల్లో మహిళా సమాఖ్య సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఈ నెల 10 నుంచి 16 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో(Assembly constituencies) సమావేశాలు ఉంటాయి. వడ్డీ లేని రుణాల నగదును చెక్కుల రూపంలో అందిస్తాం. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంపై ప్రజలకు వివరించాలి అని భట్టి తెలిపారు.