BC Reservations: రేవంత్ రాజకీయ వ్యూహం అదుర్స్

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల (BC Reservation) అంశం ఇప్పుడు రాజకీయ, సామాజిక చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయితే, ఈ ప్రక్రియలో అనేక అడ్డంకులు, రాజకీయ విమర్శలు, చట్టపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. అయితే హడావుడిగా చేసిన బిల్లులపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు బీసీ రిజర్వేషన్లలో ముస్లిం కోటా కూడా కలపడం సమస్యలకు మూలకారణంగా మారింది. రిజర్వేషన్లు 50శాతం మించితే రాజ్యాంగ సవరణ తప్పనిసరి కావడంతో కేంద్రం ఆమోదం లేకుండా ఇది కార్యరూపం దాల్చే అవకాశమే కనిపించట్లేదు. దీంతో బీసీ రిజర్వేషన్ల బిల్లు సవాళ్ల చట్రంలో చిక్కుకుంది.
బీసీ రిజర్వేషన్లు ఎందుకు?
తెలంగాణలో బీసీల జనాభా దాదాపు 56 శాతం ఉంది. ఇటీవలి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన (SEEEPC) సర్వే కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సర్వే ఆధారంగా, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించింది. తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (విద్యా సంస్థలు, రాష్ట్ర సర్వీసులలో నియామకాలు) బిల్ 2025, తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్) బిల్ 2025 లను ఈ ఏడాది మార్చి 17న ఏకగ్రీవంగా ఆమోదించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. శాసనమండలి ఆమోదం తర్వాత పార్లమెంటు ఆమోదం కోసం కేంద్రానికి పంపించారు. గతంలో 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం 37% రిజర్వేషన్ బిల్లును ఆమోదించినప్పటికీ, అది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిని ఉపసంహరించుకుని కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బిల్లులు సుప్రీం కోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని మించడంతో, వీటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అయితే, కేంద్రం ఈ బిల్లులను ఆమోదించకపోవడంతో రాష్ట్రంలో తీవ్ర చర్చ నడుస్తోంది. మరోవైపు, తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలను 90 రోజుల్లో పూర్తి చేయాలని, రిజర్వేషన్ నిర్మాణాన్ని 30 రోజుల్లో ఖరారు చేయాలని ఆదేశించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం లేదు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ జారీ చేసినప్పటికీ, దాని చట్టపరమైన చెల్లుబాటుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయ సందర్భం
బీసీ రిజర్వేషన్ బిల్లులు రాజకీయంగా సున్నితమైన అంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును తమ ఎన్నికల హామీలలో భాగంగా ముందుకు తెచ్చింది. ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డిలో జరిగిన సమావేశంలో ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని అమలు చేయడంలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన అనంతరం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపించింది. అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి నాలుగు నెలలు గడిచిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం వీటికి ఆమోదం తెలపకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంతో ఉంది. అందుకే ఎలాగైనా ఈబిల్లులను ఆమోదించుకోవాలనే ఉద్దేశంతో కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆగస్టు 6 నుంచి 8 వరకూ మూడు రోజులపాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేసింది. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లులను ఆమోదించాలని, లేకుంటే ప్రధాని మోదీని గద్దె దించుతామని సీం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించకపోతే బీజేపీ బీసీ వ్యతిరేకంగా నిలిచిపోతుంది ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది.?
బీసీ రిజర్వేషన్‌లో ముస్లిం కోటాను చేర్చడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 42 శాతం బీసీ రిజర్వేషన్‌లో 10 శాతం ముస్లింలకు కేటాయించడం హిందూ సమాజానికి అన్యాయమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆరోపించారు. మతం ఆధారంగా రిజర్వేషన్‌లు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తామని, ఇది బీసీల హక్కులను కాలరాయడమేనని వాదిస్తున్నారు. బీసీలకు కేటాయించిన 42 శాతం రిజర్వేషన్లలో 10శాతం ముస్లింలకు వెళ్లిపోతే వెనుకబడిన వర్గాలకు మిగిలేది 32శాతమేనని, ఇది ఆమోదయోగ్యం కాదని బీజేపీ వాదిస్తోంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్‌లు ఉన్నాయని కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తున్నప్పటికీ, బీజేపీ ఈ విషయంలో తమ వైఖరిని సమర్థిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ బిల్లులపై చిత్తశుద్ధి లేదని, రాజకీయ లబ్ధి కోసమే ఈ బిల్లులను ముందుకు తెస్తోందని ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లులను ఆమోదించకపోతే, బీసీల మధ్య అసంతృప్తి పెరిగి, అది రాజకీయంగా తమకు ఇబ్బంది కలిగిస్తుందని కాంగ్రెస్ భావిస్తోందని వారు వాదిస్తున్నారు.
బీఆర్ఎస్ విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ చట్టపరంగా చెల్లుబాటు కాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. బీసీ జనాభాను తక్కువగా చూపించిన సర్వేను కూడా వారు తప్పుబడుతున్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఇంటిగ్రేటెడ్ హౌస్‌హోల్డ్ సర్వేలో బీసీలు 61 శాతం ఉన్నారని, కానీ కాంగ్రెస్ సర్వేలో ఇది 56.33 శాతానికి తగ్గిందని వారు ప్రశ్నిస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కూడా బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4న ధర్నా చేపట్టారు.
బీసీ సంఘాలు ఏమంటున్నాయి?
బీసీ సంఘాలు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ బిల్లును స్వాగతించాయి. సామాజిక న్యాయం దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసిందని కొనియాడుతున్నాయి. బీసీ హక్కుల సాధన సమితి వంటి సంస్థలు ఈ చర్యను సమర్థిస్తూ, రాష్ట్రంలో బీసీల జనాభా 56.36% ఉన్న నేపథ్యంలో 42% రిజర్వేషన్ న్యాయబద్ధమైనదని పేర్కొన్నాయి. అయితే, ఈ బిల్లు వేగంగా అమలు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని చట్టంగా మార్చాలని కోరాయి. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ, బీసీలలో ఉప-కులాల (A, B, C, D, E) మధ్య రిజర్వేషన్ పంపిణీపై స్పష్టమైన చర్చ లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీసీ-E కింద ముస్లిం కులాలకు కేటాయించే కోటా ఇతర బీసీ కులాలకు అన్యాయం కలిగిస్తుందనే ఆందోళనలు కొన్ని వర్గాల నుండి వ్యక్తమవుతున్నాయి. సుప్రీం కోర్టు ఇటీవలి తీర్పు (ఆగస్టు 2024) ప్రకారం, ఎస్సీ/ఎస్టీలలో ఉప-వర్గీకరణకు అనుమతి ఉన్నప్పటికీ, బీసీలలో ఇలాంటి విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన ప్రణాళికను వెల్లడించలేదు. ఈ అంశంపై బీసీ సంఘాలలో ఏకాభిప్రాయం కుదరకపోతే, బిల్లు అమలు సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. 42% బీసీ రిజర్వేషన్ బిల్లును బీసీ సంఘాలు స్వాగతించినప్పటికీ, అత్యంత వెనుకబడిన కులాల ప్రయోజనాలు సమానంగా అందుతాయా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బీసీ-A, B వర్గాలలోని కొన్ని కులాలు రిజర్వేషన్ ప్రయోజనాలను ఎక్కువగా పొందుతున్నాయని, అత్యంత వెనుకబడిన కులాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికను రూపొందించాలని బీసీ హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
చట్టపరమైన సవాళ్లు
సుప్రీం కోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని దాటడం వల్ల ఈ బిల్లులు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిమితిని దాటడానికి రాజ్యాంగ సవరణ చేయాలి లేదంటే 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు తమిళనాడు (69%) మరియు బిహార్ (65%) వంటి రాష్ట్రాల అనుభవాల నుండి స్ఫూర్తి పొందినప్పటికీ, ఈ రాష్ట్రాలలో ఎదురైన సవాళ్లను పరిగణనలోకి తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తమిళనాడు 9వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా 69% రిజర్వేషన్‌ను సాధించగలిగినప్పటికీ, బిహార్‌లో 65% రిజర్వేషన్‌ను పాట్నా హైకోర్టు రాజ్యాంగ విరుద్ధమని తిరస్కరించింది. తెలంగాణ బిల్లు కూడా ఇటువంటి చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది.
కేంద్రం ఆమోదించకపోతే..?
కేంద్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ బిల్లులను ఆమోదించకపోతే, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఆర్డినెన్స్ జారీ లేదా స్థానిక చట్టాల ద్వారా రిజర్వేషన్‌ను అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇటువంటి చర్యలు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిహార్‌లో 65% రిజర్వేషన్ రద్దు చేసిన నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో కుల గణన చర్చలో భాగంగా ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తోంది.
సామాజిక, రాజకీయ ప్రభావం
బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. కాంగ్రెస్ ఈ బిల్లును ఎన్నికల హామీగా ముందుకు తీసుకెళ్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని భావిస్తోంది. రాజకీయంగా ఇది తమకు మేలు చేస్తుందనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అయితే, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ చర్యలను తప్పుబడుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ హడావుడి చేస్తోందని ఆరోపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లలోనే ముస్లిం రిజర్వేషన్లను కలపడం ద్వారా ఇది సాధ్యం కాదనే విషయం కాంగ్రెస్ పార్టీకి తెలుసని, దీన్ని ఆచరణ సాధ్యం కాకుండా పబ్బం గడుపుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ముస్లిం రిజర్వేషన్ అంశం కూడా బీసీ బిల్లును మరింత సంక్లిష్టం చేస్తోంది. ముస్లింలకు ఉన్న 4 శాతం కోటా కొనసాగుతుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే కేంద్రం ఆమోదం లేకుండా ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశం సామాజిక న్యాయం, రాజకీయ లబ్ధి, చట్టపరమైన సవాళ్ల మధ్య చిక్కుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లుల ద్వారా బీసీలకు న్యాయం చేయాలని చూస్తున్నప్పటికీ, కేంద్రం ఆమోదం, బీజేపీ వ్యతిరేకత, బీఆర్ఎస్ విమర్శలు, చట్టపరమైన అడ్డంకులు దీనిని సంక్లిష్టం చేస్తున్నాయి. ఈ అంశం కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా కుల గణన, రిజర్వేషన్ పరిమితులపై చర్చకు దారి తీస్తోంది. బీసీలకు న్యాయం చేకూర్చడం కోసం అన్ని పార్టీలు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ఐకమత్యంతో కేంద్రంతో చర్చలు జరపడం అవసరం. లేకపోతే, ఈ అంశం కేవలం రాజకీయ ఆయుధంగా మిగిలిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే బీసీల ఆశలు అడుగంటినట్లే..!
– సి.ఎల్.ఎన్.రాజు