Bandi Sanjay: పాకిస్థాన్‌కు వణుకుపుట్టేలా చర్యలు: కేంద్రమంత్రి బండి సంజయ్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు వణుకు పుట్టేలా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) హామీ ఇచ్చారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన ‘ఉద్యోగాల పండుగ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన 100 మందికి నియామక పత్రాలు అందజేసిన ఆయన.. పహల్గాం దాడి గురించి మాట్లాడారు. తుపాకీ పట్టినవాడు అదే తుపాకీకి బలైపోతాడని హెచ్చరించారు. పహల్గాం ఘటన ఉగ్రవాదుల క్రూరత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పాకిస్థాన్ రక్షణ మంత్రి స్వయంగా అంగీకరించిన విషయాన్ని కూడా గుర్తు చేసిన బండి సంజయ్ (Bandi Sanjay).. అడుక్కుతినే స్థితికి చేరుకున్నా పాకిస్థాన్ బుద్ధి మాత్రం మారడం లేదని మండిపడ్డారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారతదేశాన్ని చూసి పాక్ తట్టుకోలేకపోతోందని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే ఉద్యోగాల పండుగలో కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులందరికీ బండి సంజయ్ (Bandi Sanjay) అభినందనలు తెలిపారు. ఇష్టంగా పనిచేసి దేశానికి సేవ చేయాలని వారికి సూచించారు. సంక్షేమ పథకాలు చివరి వ్యక్తికి కూడా అందేలా చూడాలని కోరారు.