Smitha Sabharwal: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. స్మితా సభర్వాల్..!?

తెలంగాణ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ (Smitha Sabharwal) వృత్తిపరంగానే కాక.. సోషల్ మీడియాలో (Social Media) కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏదైనా అంశంపై తనదైన శైలిలో స్పష్టమైన అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. అయితే, ఆమె సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు ఆమెను పలు సందర్భాల్లో వివాదాల కేంద్రబిందువుగా మార్చాయి. 2001 బ్యాచ్ కు చెందిన స్మితా సభర్వాల్ ప్రస్తుతం తెలంగాణ పర్యాటకం, సాంస్కృతిక శాఖల ప్రధాన కార్యదర్శిగా (Chief Secretary) పనిచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) భూముల వివాదంలో చిక్కుకున్నారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల HCU భూములపై బుల్డోజర్లతో కూడిన AI-జనరేటెడ్ గిబ్లీ ఫోటోను స్మితా సభర్వాల్ మార్చి 31, 2025న ‘హాయ్ హైదరాబాద్’ ఎక్స్ హ్యాండిల్ నుంచి రీపోస్ట్ చేశారు. ఈ చిత్రం పర్యావరణ వినాశం పట్ల సానుభూతి కలిగించేలా ఉంది. అయితే ఈ ఇమేజ్ ను ఫేక్ (Fake) గా పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. ఇలా ఫేక్ గా సర్క్యులేట్ చేసిన వారిపై చర్యలకు సిద్ధమైంది. అందులో భాగంగా ఏప్రిల్ 12, 2025న సైబరాబాద్ పోలీసులు స్మితాకు BNSS సెక్షన్ 179 కింద నోటిస్ జారీ చేశారు. దర్యాప్తులో సహకరించాలని కోరారు. స్మితా స్పందించకపోవడంతో రెండో నోటిస్ జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా స్మితా సభర్వాల్ వ్యవహరించారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గతంలో కూడా స్మితా సభర్వాల్ కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. 2024 జులైలో స్మితా సభర్వాల్ అంగవైకల్య కోటాపై (Disability Quota) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. ఐఏఎస్ (IAS) వంటి సర్వీసుల్లో శారీరక ఫిట్‌నెస్ అవసరమని, వికలాంగుల కోటా అవసరమా అని ఆమె ఎక్స్ లో ప్రశ్నించారు. “వికలాంగ పైలట్‌ను ఎయిర్‌లైన్ నియమిస్తుందా? వికలాంగ సర్జన్‌ను నమ్ముతారా?” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వికలాంగ సమాజాన్ని అవమానకరంగా చిత్రీకరించాయని, సున్నితత్వం లోపించాయని విమర్శలు వచ్చాయి. హ్యూమన్ రైట్స్ ఫోరం స్మితా వ్యాఖ్యలను ఖండిస్తూ, ఐఏఎస్ పని ఎక్కువగా డెస్క్ జాబ్ అని, శారీరక సామర్థ్యం కంటే నిబద్ధత ముఖ్యమని పేర్కొంది. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో స్మితాపై ఫిర్యాదు నమోదైంది. ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత (Bala Latha) ఈ వ్యాఖ్యలను “అసున్నితం, అమానవీయం” అని విమర్శించారు. స్మితా సభర్వాల్ కు ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. ఆవిడ ఎక్కడికి వెళ్లినా ఆమెను అనుసరించే వాళ్లున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పీపుల్స్ ఆఫీసర్ గా పేరొందారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె వ్యాఖ్యలు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. కొన్ని పోస్టులు సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి.
1977 జూన్ 19న డార్జిలింగ్‌లో జన్మించిన స్మితా సభర్వాల్ ఆర్మీ అధికారి కల్నల్ ప్రణబ్ దాస్ కుమార్తె. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్‌లో చదివి, ICSE పరీక్షల్లో జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచారు. హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో కామర్స్ లో డిగ్రీ పూర్తిచేసి 2000లో UPSC పరీక్షలో ఆల్ ఇండియా 4వ ర్యాంక్ సాధించారు. కరీంనగర్, మెదక్ జిల్లాల్లో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమె, ఆరోగ్యం, విద్యా రంగాల్లో గణనీయమైన సంస్కరణలు తీసుకొచ్చారు. సమర్థ్యవంతమైన అధికారిగా, సాంకేతికతను వినియోగించి పరిపాలనలో ఆవిష్కరణలు చేసిన మహిళగా ఘనత పొందారు.