Revanth Reddy: రేవంత్ రెడ్డి గారూ.. మీరు కొంచెం మారాలి..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాజకీయ ప్రయాణం ఒక సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర అత్యున్నత పదవి వరకు సాగింది. ఆయన సహజత్వం, ప్రజలతో సన్నిహితంగా మెలగడం, ఆత్మీయంగా ఉండే తీరు ఆయనను రాజకీయంగా ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే, ఈ మంచితనాన్ని కొందరు ఆసరాగా తీసుకుని, ఆయన సీఎం హోదాకు తగని రీతిలో ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మనోడే అనే భావనతో కొంతమంది ఆయన ముందు చిల్లర వేషాలు వేస్తూ, పదవికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మరచి వ్యవహరిస్తున్నారు.
రేవంత్ రెడ్డి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. సామాన్య కార్యకర్తలతో, పాత పరిచయస్తులతో ఎలాంటి అహంకారం లేకుండా మాట్లాడతారు. ఈ లక్షణం ఆయనను ప్రజలకు చేరువ చేసినప్పటికీ, కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకుని అతిగా చనువు ప్రదర్శిస్తున్నారు. కొన్ని ప్రజా కార్యక్రమాలలో స్థానిక నాయకులు, కార్యకర్తలు రేవంత్‌తో అతిగా సరదాగా, హద్దులు మీరిన రీతిలో మాట్లాడుతున్నారు. ఆయన హోదాను తేలిగ్గా తీసుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. “మనోడే కదా” అనే భావనతో వారు సీఎం పదవి గౌరవాన్ని మరచి, చిల్లర వ్యవహారాలకు దిగుతున్నారు.
సీఎం పదవి అనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, బాధ్యతల సంకేతం. రేవంత్ రెడ్డి సహజంగా ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు, కానీ అధికారిక కార్యక్రమాలలో, ప్రజల ముందు ఆ పదవికి తగిన గంభీరత అవసరం. కొంతమంది నాయకులు, కార్యకర్తలు రేవంత్ మంచితనాన్ని దుర్వినియోగం చేస్తూ, ఆయనతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణకు, ఇటీవల ఒక కార్యక్రమంలో ఓ స్థానిక నాయకుడు రేవంత్‌తో అతి సన్నిహితంగా, హాస్యాస్పదంగా మాట్లాడిన సంఘటన సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. ఇలాంటి సందర్భాలు రేవంత్ వ్యక్తిగత ఇమేజ్‌కు మాత్రమే కాక, సీఎం కార్యాలయ గౌరవానికి కూడా భంగం కలిగిస్తాయి. తాజాగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో (Gaddar Film Awards) కూడా సీఎం చాలా సింపుల్ గా వ్యవహరించారు. రెండు గంటలపాటు అక్కడ సమయం కేటాయించారు. కానీ ఆయన్ను, ఆయన హోదాను అక్కడి వాళ్లు పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. చాలా మంది సినిమా స్టార్లు ఈ కార్యక్రమాన్ని చాలా లైట్ గా తీసుకున్నారు. అవార్డులు తీసుకునేందుకు కూడా రాలేదు.
ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని ఉదాహరణగా తీసుకోవచ్చు. జగన్ తన పదవి కాలంలో సీఎం హోదాకు తగిన గంభీరతను పాటించారు. ఆయన సహచరులు, అనుచరులకు పెద్దగా చనువు ఇవ్వలేదు. దూరం పెట్టారు. అధికారిక సందర్భాలలో హద్దులు దాటకుండా చూసుకున్నారు. జగన్ తన చుట్టూ ఒక నిర్దిష్ట గౌరవ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ అది ఆ తర్వాత ఎన్నికల్లో దెబ్బకొట్టింది. అది వేరే విషయం.
రేవంత్ రెడ్డి సీఎం పదవి కేవలం రాజకీయ అవకాశం లేదా వారసత్వంగా వచ్చింది కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో, రేవంత్ దానికి ఊపిరి పోసి, ప్రజల్లోకి తీసుకెళ్లి, అధికారంలోకి తెచ్చారు. ఈ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, పోరాటాలు ఈ పదవి విలువను సూచిస్తాయి. అందుకే ఈ హోదాను అగౌరవపరిచే అవకాశం ఎవరికీ ఇవ్వకూడదు. కొంతమంది కార్యకర్తలు, నాయకులు ఆయన మంచితనాన్ని ఆసరాగా తీసుకుని చేసే అనుచిత వ్యవహారాలు, ఆయన కష్టార్జిత గౌరవానికి తగ్గిస్తాయి.
సోషల్ మీడియాలో (Social Media) రేవంత్ రెడ్డి వ్యవహశైలిపై విమర్శలు కనిపిస్తున్నాయి. “రేవంత్‌తో కొందరు కార్యకర్తలు సినిమా స్టైల్లో జోకులేస్తున్నారు, ఇది సీఎం పదవికి తగినా?” అనే ప్రశ్నను కొంతమంది లేవనెత్తారు. ఇలాంటి విమర్శలు రాజకీయ ప్రత్యర్థుల నుంచి వచ్చినవైనా, రేవంత్ తన వ్యవహారశైలిలో కొంత క్రమశిక్షణ పాటిస్తే, ఇలాంటి విమర్శలను తగ్గించవచ్చు. అధికారిక సందర్భాలలో గంభీరత, కార్యకర్తలతో హద్దులు నిర్ణయించడం ద్వారా ఆయన హోదా గౌరవాన్ని కాపాడుకోవచ్చు.