Revanth Reddy: భయం పుట్టించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్..!?

రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు చాలా కామన్. ఆ ఎత్తుల్లో ఎవరు ఎంత వేగంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారో వాళ్లదే విజయం. రాజకీయంగా ఎదగడానికి ఎన్నో డక్కామొక్కీలు తినాల్సి ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకోగలిగిన వాళ్లా రాటుదేలుతారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా ఈ కోవకే చెందుతారు. అసలు రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈయనా.. ముఖ్యమంత్రా.. అని ఇప్పటికీ చాలా మంది తెలంగాణవాసులు అనుకుంటూ ఉన్నారు. అయితే ఏదో ఒక రూపంలో తన ఉనికిని, అస్తిత్వాన్ని రుజువు చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఎంచుకున్న అస్త్రం – భయం.!
అవును.. రేవంత్ రెడ్డి భయపెట్టడంలో సక్సెస్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లూ అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ఎంచుకున్న అస్త్రం కూడా భయమే. ఎవరైనా ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లను ఏదో ఒక రూపంలో భయపెట్టడం జగన్ నైజం. అలాంటి వాళ్లపై కేసులు పెట్టడం, బొక్కలో తోయడం, సోషల్ మీడియాలో ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లను బెదిరించడం.. లాంటివి గత ఐదేళ్లలో చాలా చూశాం. అందుకే జగన్ కు వ్యతిరేకంగా ఎవరూ నోరు మెదిపే వాళ్లు కాదు. జగన్ చేస్తున్నది తప్పు అని తెలిసినా.. అలా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారోననే భయంతో కామ్ గా ఉండిపోయారు. చివరకు అది ఎన్నికల ఫలితాల్లో రుజువైంది. అది వేరే సంగతి.
ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే బాటలో పయనిస్తున్నారనేది తెలంగాణ వాదులు చెప్తున్న మాట. హైడ్రా, మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి, లగచర్ల గొడవ.. లాంటి అనేక అంశాల్లో రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్లపై కేసులు నమోదయ్యాయి. ఇక విపక్షాలను కూడా రేవంత్ రెడ్డి ఏమాత్రం సహించట్లేదు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పెద్దఎత్తున గళం విప్పిన కేటీఆర్ (KTR).. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఇందుకు కారణం ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E-Race Case) అని అందరికీ తెలిసిన విషయమే. ఆ మద్య నేషనల్ మీడియా కాంక్లేవ్ లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. మెట్రో రైలు అధికారిపై కేసు పెట్టి బొక్కలో తోయాలని చెప్పినట్లు స్వయంగా చెప్పారు. అంటే ఎవరైనా ఏదైనా తనకు నచ్చని పని చేస్తే వాళ్లను భయపెట్టాలనుకుంటున్నట్టు అర్థమవుతోంది.
ఇక అల్లు అర్జున్ అరెస్టు (Allu Arjun Arrest) వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే. ఈ ఒక్క సంఘటన ద్వారా సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని తన దారికి తెచ్చుకోగలిగారు రేవంత్ రెడ్డి. గతంలో ఏపీలో కూడా సీఎం జగన్ సినిమా పెద్దలను ఇలాగే తన కాళ్లదగ్గర బేరమాడేలా చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ చేయగలిగారు. అంతేకాదు.. సొంత పార్టీ నేతలు కూడా నోరు మెదపకుండా రేవంత్ రెడ్డి బాగానే కంట్రోల్ చేయగలిగారు. సహజంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరైనా తమకు ఇష్టం వచ్చినట్ల మాట్లాడుతుంటారు. రేవంత్ సీఎం కాకముందు ఆయనపై ఎంతోమంది బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. కానీ ఇప్పడు ఒక్కరు కూడా ఆయనకు వ్యతిరేకంగా నోరు మెదిపేందుకు సాహసించట్లేదు. ఇందుకు కారణం భయం. దీన్ని క్రియేట్ చేయడంలో రేవంత్ రెడ్డి సూపర్ సక్సెస్ అయ్యారు.