Revanth Reddy: రేవంత్ రెడ్డి అన్నీ తానే అనుకుంటున్నారా..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్లను కాదని టీడీపీ (TDP) నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని సీఎం చేసింది కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command). క్రౌడ్ పుల్లర్ గా ఉండడం, కేసీఆర్ (KCR) ను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉండడం, అదే సమయంలో కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు అంతర్గత విభేదాలతో కొట్టుకుంటూ ఉండడంతో రేవంత్ రెడ్డి బెస్ట్ ఆప్షన్ అని భావించింది కాంగ్రెస్ పార్టీ. అందుకే మొదట పీసీసీ (PCC) పగ్గాలిచ్చింది. పార్టీని అధికారంలోకి తీసుకురాగానే ఏమాత్రం సంకోచించకుండా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం అప్పగించింది.
రేవంత్ రెడ్డి సీఎం అవుతారని కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ ఊహించలేదు. ఆ మాటకొస్తే రేవంత్ రెడ్డి అనుచరులు కూడా ఎక్స్ పెక్ట్ చేయలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రశ్నే లేదనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎలక్షన్ స్ట్రాటజీ, పోల్ మేనెజ్మెంట్ వర్కవుట్ అయ్యాయి. దీంతో సొంతంగానే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ సాధించగలిగింది. దీంతో రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ కు మరింత నమ్మకం ఏర్పడింది. అందుకే ఆయన అడిగిన ప్రతి దానికీ ఓకే చెప్తోంది. మరోవైపు కాంగ్రెస్ అసంతృప్తులు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట కాదనే ప్రసక్తే లేకుండా పోయింది. ఎన్నికల ముందు రేవంత్ ను విమర్శించిన వాళ్లంతా ఇప్పుడు శెభాష్ రేవంత్ అని పొగుడుతున్నారు.
అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుంది. రేవంత్ రెడ్డి తొలి ఏడాదంతా ప్రభుత్వంపైనే ఫోకస్ పెట్టారు. తాము హామీ ఇచ్చిన గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడిప్పుడే అవన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయి. దీంతో ఇప్పుడు పార్టీపై దృష్టి పెట్టారు. నూతన ఏడాది తొలిరోజు పార్టీలో పలువురికి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పారు. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఇంతవరకూ బాగానే ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి తానే సుప్రీం అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నేను మారాను.. మీరు కూడా మారాలి.. మీ అందరి చిట్టా నా దగ్గర ఉంది. మీ ప్రోగ్రెస్ రిపోర్టులను (Progress Report) ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నాను.. సమర్థవంతంగా పని చేయకపోతే పదవులు రావు.. ఇలా ఆయన ఓ విధమైన బెదిరింపు ధోరణితో శ్రేణులను హెచ్చరించారు. సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి మాటలు వినిపించవు. ఇక్కడ పీసీసీ చీఫ్ లేదా సీఎం ఏదైనా ఒక మాట అంటే నేరుగా వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారు. కానీ ఇక్కడుంది రేవంత్ రెడ్డి. హైకమాండ్ కూడా ఆయన మాటకే విలువ ఇస్తోంది. దీంతో నేతలెవరూ హైకమాండ్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయరనే భరోసాతోనే రేవంత్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన హవా కొనసాగినన్ని రోజులు ఎలాంటి ఇబ్బందులూ ఉండకపోవచ్చు. ఏదైనా తేడా జరిగితే మాత్రం రివర్స్ కావడం ఖాయం. కాబట్టి కాంగ్రెస్ లాంటి పార్టీల్లో నేతలు కాస్త ఆలోచించి మాట్లాడాలి.