KTR : కేటీఆర్‌పై మరిన్ని కేసులు నమోదు కానున్నాయా..?

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు – కేటీఆర్ (KTR) పై ఫార్ములా ఈ-రేస్ కేసు నమోదైంది. బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఫార్ములా ఈ-రేస్ (Formula E-Race) నిర్వహించింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. ఈ రేస్ నిర్వహణకోసం HMDA దాదాపు రూ.50 కోట్ల రూపాయలను ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నెక్స్ట్ జెన్ కు అందించారు. ఇది వివాదానికి మూల కారణం. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ నిధులను బదిలీ చేశారనేది ప్రధాన ఆరోపణ. మంత్రి కేటీఆర్ చెప్పడం వల్లే ఈ నిధులను బదిలీ చేసినట్లు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ విచారణలో వెల్లడించారు. దీంతో కేటీఆర్ పై కేసు నమోదైంది.
విదేశీ సంస్థలకు నిధులు బదిలీ చేయాలంటే తప్పకుండా RBI అనుమతి ఉండాలి. అంతేకాక.. HMDA నుంచి ఈ నిధులు బదిలీ అయ్యాయి. కానీ HMDA అనుమతి లేదు. కేవలం కేటీఆర్ చెప్పారనే కారణంలో అధికారులు నిధులను పంపించేశారు. ఇది అక్రమమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసు పెట్టింది. ఏసీబీ దీన్ని విచారిస్తోంది. గవర్నర్ కూడా కేటీఆర్ పై కేసు నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయనపై FIR నమోదు చేసింది. అయితే కేటీఆర్ వెంటనే హైకోర్టును (High Court) ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ నెలాఖరు వరకూ కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కేటీఆర్ కు ఊరట లభించింది.
అయితే ఫార్ములా ఈ-రేస్ కేసు వ్యవహారం కేవలం ఏసీబీకి (ACB) మాత్రమే పరిమితం కాలేదు. ఈడీ (ED) కూడా కేసు నమోదు చేసింది. డబ్బు లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈడీ జోక్యం చేసుకుంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై కేసు బుక్ చేసింది. ఇప్పుడు కేటీఆర్ అండ్ కో ఈడీ కేసును కూడా ఎదుర్కోవాల్సి ఉంది. అంతేకాదు.. హైదరాబాద్ శివార్లలో దాదాపు 15వేల కోట్ల రూపాయల విలువైన భూదాన్ (Bhudan Lands) భూములను ధరణి (Dharani) ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించారనే ఆరోపణలున్నాయి. ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అయితే ఆయన వెనుక ఓ బడా నేత ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇందులో కూడా కేటీఆర్ ను విచారించే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు అవుటర్ రింగ్ రోడ్ (ORR) టోల్ లీజ్ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. తాజాగా ఈ లీజ్ రద్దు చేయాలనే డిమాండ్ వస్తోంది. అయితే గంపగుత్తగా లీజ్ రద్దు చేయడం కుదరదు కాబట్టి దీనిపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఈ వ్యవహారంలో కూడా కేటీఆర్ పై ఆరోపణలున్నాయి. ఇక సెక్రటేరియేట్ లో ఐటీ పరికరాల కొనుగోళ్లలో కూడా భారీ ఎత్తున అవకతవకలు జరిగాయనే వార్తలు వస్తున్నాయి. దీనిపైన కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా నాలుగైదు కేసులు కేటీఆర్ మెడకు వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది.