KCR – Kavitha: కవిత – కేసీఆర్ ఎపిసోడ్‌లో జరిగింది ఇదేనా..?

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలు తీవ్ర రూపం దాల్చాయి. ముఖ్యంగా, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) పార్టీలో తన స్థానం, పాత్రపై అసంతృప్తితో ఉన్నారనే వార్తలు విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఆమె అరెస్టై, ఆరు నెలల పాటు తీహార్ జైలులో గడపడం, ఆ తర్వాత పార్టీలో ఆమె పాత్రను కేసీఆర్ స్వయంగా తగ్గించడం ఈ వివాదానికి మూలమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కవిత సొంత రాజకీయ పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే, ఇటీవల ఆమె రాసిన లేఖ లీక్ కావడం, దానిపై ఆమె చేసిన వ్యాఖ్యలు కేసీఆర్‌ను మరింత ఆగ్రహానికి గురిచేశాయని, ఆయన మధ్యవర్తుల ద్వారా కవితకు హెచ్చరికలు పంపినట్లు తాజా సమాచారం.
2024 మార్చి నుంచి ఆగస్టు వరకు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత జైలు శిక్ష అనుభవించారు. ఈ కేసు బీఆర్ఎస్‌కు రాజకీయంగా తీవ్ర నష్టం కలిగించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడానికి కవిత అరెస్టు ఒక కారణమని పార్టీలోని కొందరు నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, కవితను పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయం కవితను మరింత అసంతృప్తికి గురిచేసింది. ఆమె జైలు నుంచి విడుదలైన తర్వాత, పార్టీలో తనకు తగిన గౌరవం, పాత్ర లభించడం లేదని భావించిన కవిత, తన సొంత రాజకీయ మార్గాన్ని ఎంచుకునే ఆలోచనలో పడ్డారని సమాచారం.
గత నెల 2న కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ కావడం బీఆర్ఎస్‌లో పెను సంచలనం సృష్టించింది. ఈ లేఖలో, ఆమె కేసీఆర్ ప్రసంగం బీజేపీపై తగినంత దూకుడుగా లేదని, పార్టీలోని కొందరు నాయకులు బీజేపీతో విలీనం కావాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ లేఖ లీక్‌కు పార్టీలోని అంతర్గత శత్రువులే కారణమని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు కేటీఆర్‌ను ఉద్దేశించినవని, ఆమె తన సోదరుడిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారని రాజకీయ వర్గాలు చర్చించాయి. ఈ ఘటన తర్వాత, కేసీఆర్ మరింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మధ్యవర్తుల ద్వారా కవితకు హెచ్చరికలు పంపినట్లు సమాచారం. దీంతో కవిత కొంతవరకు మెత్తబడ్డారని తెలుస్తోంది.
కొన్ని రోజులుగా కవిత మళ్లీ కేసీఆర్, కేటీఆర్ లకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో ఫాంహౌస్ వెళ్లి కేసీఆర్ ను కలిసారు. అప్పుడు కూడా కేసీఆర్, కవితన దగ్గరకు రానీయలేదని తెలుస్తోంది. కవిత వల్ల పార్టీకి తీరని నష్టం జరిగిందని భావిస్తున్న కేసీఆర్, ఆమెను మెయిన్ స్ట్రీమ్ నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అలా కాదని పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైన కేసీఆర్ స్పష్టమైన సంకేతాలు పంపించారని సమాచారం. అందుకే ఇప్పుడు కవిత మళ్లీ మెత్తబడ్డారు. కేసీఆర్, కేటీఆర్ లను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందంటూ కొత్త పల్లవి అందుకున్నారు. వాళ్లకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. దీంతో కవిత కొత్త పార్టీ ఆలోచన లేనట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.