Kavitha: BRSతో కవిత తెగదెంపులు? ఇక సొంత బాటే..!?

భారత రాష్ట్ర సమితి (BRS)లో గత కొంతకాలంగా రాజకీయ గందరగోళం, అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు (KCR) కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలు BRSలోని అంతర్గత సంక్షోభాన్ని మరింత స్పష్టం చేశాయి. తాజాగా కవిత BRS నాయకత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుతవం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ పై (BC Reservations) పార్టీ వైఖరిని తప్పుబట్టారు. ఇదిప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, తన తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె BRS వైఖరిని తప్పుబట్టారు. “ఆర్డినెన్స్ సరైనదే, BRS వాళ్లు దీన్ని వద్దని చెప్పడం తప్పు. వారు మెల్లగా నా దారికి రావాల్సిందే,” అని కవిత స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీ అధిష్ఠానంతో ఆమెకున్న విభేదాలను సూచిస్తున్నాయి. అంతేకాక, బీసీ నాయకుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) ఆమెపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై BRS నాయకత్వం స్పందించకపోవడంపై కూడా కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఆ విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను” అని ఆమె పేర్కొన్నారు. తాజా వ్యాఖ్యలను బట్టి ఆమె ఇక తన సొంతబాటలో పయనించేందుకు సిద్ధమైందనే సంకేతాలిస్తున్నాయి. ఢిల్లీ మద్యం విధానం కేసులో కవిత జైలు శిక్ష అనుభవించినప్పుడు పార్టీ నాయకత్వం నుంచి తగిన మద్దతు లభించలేదని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవలి చర్యలు, BRS నుంచి దూరం జరిగే సంకేతాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
BRS ఎప్పుడూ కేసీఆర్ కుటుంబం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. కేసీఆర్, కవిత, KTR, హరీష్ రావు వంటి కీలక సభ్యులు పార్టీ నాయకత్వంలో ఉన్నప్పటికీ.. ఇటీవల కవిత, KTR మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కవిత, KTR పార్టీని సంప్రదాయబద్దంగా నడుపుతున్నారని, ఆందోళనల ద్వారా పార్టీని బలోపేతం చేయాలనే తన ఆలోచనకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో ఆమె, KCR చుట్టూ “దెయ్యాలు” ఉన్నాయని, అవి BRSని బీజేపీతో విలీనం చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు KCR, KTR నుంచి స్పష్టమైన స్పందన రాకపోవడం గమనార్హం.
తెలంగాణ జాగృతి ద్వారా కవిత, బీసీ రిజర్వేషన్ల కోసం ఆందోళనలు చేపట్టడం, రైల్ రోకో వంటి కార్యక్రమాలు ప్రకటించడం ద్వారా తన రాజకీయ స్థానాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ కార్యక్రమాలకు, BRSకు సంబంధం లేదు. అలాగని ఆమెను వ్యతిరేకించనూ లేదు. తాజాగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కవితపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. వీటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా స్పందించలేదు. కొంతమంది లీడర్లు మాత్రం అలాంటి మాటలు సరికాదని తోసిపుచ్చారు. ఈ అంశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తీరుపై కవిత అసంతృప్తితో ఉన్నారు.
కవిత బీసీ రిజర్వేషన్ల విషయంలో తీసుకున్న వైఖరి, BRSలోని ఇతర నాయకుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంది. తెలంగాణ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ జారీ చేయడంపై కవిత సంతోషం వ్యక్తం చేస్తూ, దీనిని తెలంగాణ జాగృతి విజయంగా అభివర్ణించారు. అయితే BRS నాయకులు, ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈ ఆర్డినెన్స్‌లో చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని, కేంద్రం నుంచి ఆమోదం లేకుండా ఇది విఫలమవుతుందని వాదించారు. ఈ వైరుధ్యం కవితను పార్టీలో మరింత ఒంటరిని చేసింది.
కవిత చర్యలు, కుటుంబ విభేదాలు BRS రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి, అనేక నాయకుల బీఆర్ఎస్ నుంచి వలసలు, కేసీఆర్ కుటుంబంలోని అంతర్గత ఘర్షణలు పార్టీని బలహీనపరుస్తున్నాయి. కవిత స్వతంత్రంగా వ్యవహరించే ప్రయత్నం, బీసీ సామాజిక వర్గాల మద్దతు సంపాదించే దిశగా ఆమె అడుగులు పార్టీలో కొత్త రాజకీయ సమీకరణలకు దారితీయవచ్చు. అయితే, KCR, KTRలు ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్నది పార్టీ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశం.