Banakacherla: బనకచర్ల ప్రాజెక్టు వివాదంపై చర్చలే పరిష్కారమా..?

ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు (Godavari Banakacherla Link Project) రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదానికి కారణమవుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా, పెన్నా నదుల ద్వారా రాయలసీమ (Rayalaseema) వంటి ఎడారి ప్రాంతాలకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తోంది. అయితే, ఈ ప్రతిపాదన తెలంగాణలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తూ, రాజకీయ రగడగా మారింది. తెలంగాణ (Telangana) అడ్డుకుంటే కేంద్రం వద్దే తేల్చుకుంటామని ఏపీ (AP) ప్రభుత్వం చెప్తోంది. ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రాన్ని కోరింది. అవసరమైతే ఏపీతో నేరుగా చర్చిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
బనకచర్ల ప్రాజెక్టు కేవలం గోదావరి (Godavari) మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడానికేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. “సముద్రంలో కలిసిపోయే నీటిని మాత్రమే మేం వినియోగిస్తాం. తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదు” అని ఆయన అమరావతిలో విలేకరులతో అన్నారు. తెలంగాణ కూడా తమ సొంత ప్రాజెక్టులను నిర్మించుకోవాలని, తాను గతంలో తెలంగాణలోని కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను ఎప్పుడూ వ్యతిరేకించలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు 200 టీఎంసీ నీటిని మాత్రమే వినియోగిస్తుందని, ఇది 3,000 టీఎంసీ వరద నీటిలో స్వల్ప భాగమని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వాదించారు.
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టు 1980 గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (GWDT) అవార్డు, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తున్నారు. “తెలంగాణ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాకముందే మిగులు జలాలు ఎలా నిర్ణయిస్తారు?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ రైతుల హక్కులకు భంగం కలిగిస్తుందని, గోదావరి నీటిలో తమకు 968 టీఎంసీ వాటా ఉందని తెలంగాణ వాదిస్తోంది.
ఈ విషయంలో తెలంగాణ అఖిలపక్ష సమావేశం నిర్వహించి, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని తీర్మానించింది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి జూన్ 19న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి, ఏపీ సమర్పించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ ను తిరస్కరించాలని కోరారు. కేంద్రం తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఆలస్యం చేస్తూ, ఏపీ ప్రాజెక్టులకు వేగంగా ఆమోదం తెలపడం సరికాదని వారు వాదించారు. పాటిల్ ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి ఈ సమస్యపై ఏపీతో నేరుగా చర్చలకు సిద్ధమని, అవసరమైతే చంద్రబాబును హైదరాబాద్‌కు ఆహ్వానిస్తామని ప్రకటించారు. “రాష్ట్రాల మధ్య వివాదాలు వ్యక్తిగత గొడవలు కావు. చర్చల ద్వారా పరిష్కారం చూడాలి” అని ఆయన అన్నారు. ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ లింక్ ప్రాజెక్టును కేంద్ర నిధులతో చేపట్టడం ద్వారా రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం చేకూరుతుందని రేవంత్ ప్రతిపాదించారు. అయితే, తెలంగాణ హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు.
ఈ వివాదంలో రాజకీయ ఆరోపణలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి, చంద్రబాబుతో కుమ్మక్కై తెలంగాణ హక్కులను తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు టి. హరీష్ రావు, ఆరోపించారు. అయితే, రేవంత్ రెడ్డి 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బనకచర్ల సర్వేలకు అనుమతి ఇచ్చిందని, గోదావరి నీటిని ఏపీకి దారాదత్తం చేసిందని విమర్శించారు.
నీటి వివాదాలపై ఇరు రాష్ట్రాలు సహకారంతో ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవడం రెండు రాష్ట్రాలకూ అవసరమని, అయితే ఇందుకు చట్టబద్ధమైన ప్రక్రియలు, పారదర్శకత అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం మధ్యవర్తిత్వంతో జరిగే చర్చలు ఈ వివాదానికి పరిష్కారం చూపగలవని ఆశిస్తున్నారు. మొత్తంగా, బనకచర్ల ప్రాజెక్టు వివాదం రెండు రాష్ట్రాల మధ్య సహకారం, చర్చల అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. రాజకీయ లబ్ధి కంటే రైతుల హక్కులు, నీటి సమర్థ వినియోగం ప్రాధాన్యత పొందాలని అందరూ కోరుకుంటున్నారు.