Formula E Case: ఫార్ములా ఈ కార్ కేసు.. అరెస్టులకు రంగం సిద్ధమైందా..?

2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ (Formula E-Race Case) వెనుక ఆర్థిక అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఇది తెలంగాణ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో సంచలనం సృష్టించింది. భారత రాష్ట్ర సమితి (BRS) నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR), సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్.రెడ్డిలపై ACB కేసు పెట్టింది. వీళ్లను విచారిస్తోంది. తాజాగా అరవింద్ కుమార్ మరోసారి ఏసీబీ ముందు విచారణకు హాజరై కీలక విషయాలు వెల్లడించారు. దీంతో ఇక అరెస్టులు జరగనున్నాయన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
2023లో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ రేస్ ను ఏస్ నెక్స్ట్ జన్ అనే సంస్థ స్పాన్సర్ చేసింది. అయితే, రెండో ఎడిషన్‌కు స్పాన్సర్ చేయలేమని చేతులెత్తేసింది. దీంతో అప్పటి BRS ప్రభుత్వం HMDA ద్వారా ₹55 కోట్లు లండన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO) కంపెనీకి బదిలీ చేసింది. రాష్ట్ర కేబినెట్, ఆర్థిక శాఖ, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతులు తీసుకోకుండానే ఈ నిధులు బదిలీ చేశారనేది ప్రధాన ఆరోపణ. అంతేకాక ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఈ చెల్లింపులు జరిగాయని, ఇది నిబంధనలకు విరుద్ధమని ACB చెప్తోంది.
డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఎడిషన్ రద్దు చేసింది. ఈ ఆర్థిక అక్రమాలపై ACB విచారణ ప్రారంభించింది. డిసెంబర్ 19, 2024న.. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతితో KTR, అరవింద్ కుమార్, BLNరెడ్డి పై FIR నమోదైంది. అరవింద్ కుమార్ ఈ ఏడాది జనవరిలో మొదటిసారి విచారణకు హాజరయ్యారు. తాజాగా ఇవాళ మరోసారి ఏసీబీ ముందుకు వెళ్లారు. ఇవాల్టి విచారణలో అరవింద్ కుమార్ పలు కీలక వెల్లడించినట్లు సమాచారం. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి (KTR) ఆదేశాల మేరకు నిధులు బదిలీ చేశానని, తనకు వ్యక్తిగత ప్రమేయం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. KTR స్వయంగా వాట్సాప్ ద్వారా FEOకి నిధులు విడుదల చేయాలని ఆదేశించారని చెప్పారు. బిజినెస్ రూల్స్ ప్రకారం వెళ్లాలని, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని మంత్రికి సూచించినప్పటికీ, KTR “వెంటనే నిధులు విడుదల చేయండి, నేను చూసుకుంటాను” అని చెప్పారని వెల్లడించారు. ₹45.71 కోట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటిష్ పౌండ్లలో చెల్లించినట్లు తెలిపారు. ఈ లావాదేవీలలో తనకు వ్యక్తిగత స్వార్థం లేదని స్పష్టం చేశారు.
అరవింద్ కుమార్ స్టేట్ మెంట్ KTR కు ఉచ్చు బిగిస్తున్నాయి. KTR చెప్పినందు వల్లే తాము చేశామని అధికారులు చెప్పడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు ఎందుకంటే అతను నిబంధనలను ఉల్లంఘించి నిధుల బదిలీకి ఆదేశాలు జారీ చేశారని సూచిస్తున్నాయి. జూన్ 16న KTR రెండోసారి ACB విచారణకు హాజరయ్యారు. తనకు అరెస్టు భయం లేదని, ఈ కేసు రాజకీయ కక్షసాధింపు అని ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్‌కు గ్లోబల్ గుర్తింపు తెచ్చిందని, అన్ని లావాదేవీలు పారదర్శకంగా జరిగాయని వాదించారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో ACB దర్యాప్తు దాదాపు పూర్తయింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గవర్నర్ అనుమతి కోసం చార్జ్ షీట్ పంపే అవకాశం ఉంది. ఆయన అనుమతిస్తే KTR, అరవింద్ కుమార్, బి.ఎల్.ఎన్.రెడ్డిల అరెస్టు ఉండొచ్చని సమాచారం. గతేడాది డిసెంబర్ లో KTR అరెస్టును హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా ఈ కేసులో PMLA, FEMA ఉల్లంఘనలపై దర్యాప్తు చేస్తోంది.