KCR : కేసీఆర్ ఇక ఫాంహౌస్ దాటి బయటకు రారా..?

తెలంగాణలో (Telangana) పదేళ్లపాటు అధికారంలో ఉంది బీఆర్ఎస్ (BRS) పార్టీ. ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ప్రతిపక్షనేత. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజోపయోగ కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత కచ్చితంగా ప్రతిపక్ష నేతదే. తెలంగాణలో సీనియర్ మోస్ట్ నేతగా, ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నేతగా ఆయన అలాంటి పాత్ర పోషించాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇవేవీ పట్టించుకోవట్లేదు. కేవలం ఫాంహౌస్ కు మాత్రమే పరిమితమైపోయారు. ఆయన ఇంకెప్పుడు బయటికొస్తారనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తోంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసిన ఘనత కచ్చితంగా బీఆర్ఎస్ దే. అందుకే ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను జాతిపితగా ఆయన అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. తెలంగాణను సాకారం చేసినందుకు ఆయన్ను పదేళ్లపాటు అధికారంలో కూర్చోబెట్టారు ప్రజలు. ఆ పదేళ్లూ కేసీఆర్ తనదైన శైలిలో పరిపాలించారు. తెలంగాణను అగ్రపథంలో నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు. అయినా తాజా ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని ప్రజలు ఓడించారు. దీంతో ఆయన ప్రతిపక్షపార్టీ నేతగా పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఆయన తన పాత్రను సరిగా పోషించట్లేదని అందరూ భావిస్తున్నారు.
రాష్ట్రాధినేతగా ముఖ్యమంత్రికి (Telangana Chief Minister) ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షనేతకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం ఏదైనా తప్పుదారిలో వెళ్తుందని భావించినప్పుడు అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షనేతదే. కానీ కేసీఆర్ ఈ విషయంలో విఫలమవుతున్నారు. ఆయన కనీసం సభకు కూడా రావట్లేదు. సభ సంగతి సరే.. కనీసం మీడియాతో మాట్లాడట్లేదు.. ప్రజల్లోకి వెళ్లట్లేదు. మంచో చెడో ప్రభుత్వం ఒక పని చేసినప్పుడు దానిపై స్పందించి జనాలకు చెప్పగలిగేత ప్రతిపక్షం ఏమనుకుంటోందో తెలుస్తోంది. ఆయన పార్టీ తరపున కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) లాంటి వాళ్లు మాట్లాడుతున్నా కేసీఆర్ మాట్లాడితే దాని ప్రభావం వేరుగా ఉంటుంది.
తెలంగాణలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది. ఈ ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి (Telangana Assembly) హాజరయ్యారు. ఆరోజు కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు. తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Ex PM Manmohan Singh) చనిపోవడంతో ఆయనకు నివాళులు అర్పించేందుకు అసెంబ్లీ సమావేశమైంది. ఈ సమావేశానికి కేసీఆర్ వస్తారని అందరూ ఆశించారు. తెలంగాణ ఇవాళ సాకారమైందంటే అందుకు కారణం మన్మోహన్ సింగ్. తెలంగాణ ఇచ్చింది ఆయనే. అలాంటప్పుడు కచ్చితంగా బీఆర్ఎస్ తరపున ఆయన హాజరై నాటి పరిణామాలను కేసీఆర్ వివరిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈ ప్రత్యేక సమావేశానికి కూడా కేసీఆర్ రాలేదు. ఫాంహౌస్ (KCR Farm House) కే పరిమితమయ్యారు. దీన్నిబట్టి ఆయన ఇక పూర్తిగా ఫాంహౌస్ కే పరిమితమవుతారని.. ప్రజల్లోకి రాకపోవచ్చని అనుకుంటున్నారు.