BRS: బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి… మూకుమ్మడి సమస్యలతో సతమతం

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఒకప్పుడు అజేయ శక్తిగా రాణించిన భారత రాష్ట్ర సమితి (BRS) ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) నాయకత్వంలోని బీఆర్ఎస్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు కుటుంబ విభేదాలు, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) నుంచి వస్తున్న ఒత్తిడి, ఇంకోవైపు బీజేపీ (BJP) రూపంలో కొత్త రాజకీయ ముప్పు… ఇవన్నీ బీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుమారుడు కె. తారక రామారావు (KTR), కుమార్తె కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha), మేనల్లుడు హరీష్ రావు (Harish Rao) వంటి వారు పార్టీలో ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, ఇటీవల కేటీఆర్, కవిత మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని ప్రచారం జరుగుతోంది. కవిత రాసిన ఒక లేఖ పార్టీలోని అసంతృప్త నేతలచే లీక్ కావడం, ఆమె జిల్లా పర్యటనలకు కేసీఆర్ నుంచి అనుమతి లభించకపోవడం వంటి ఘటనలు కుటుంబంలో విభేదాలకు కారణమయ్యాయి. ఈ విభేదాలు పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కేసీఆర్ ఈ సమస్యలను పరిష్కరించడంలో ఆసక్తి చూపకపోవడం వల్ల పార్టీలో గందరగోళం మరింత పెరిగింది.
మరోవైపు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి ఆరోపణలపై దృష్టి సారించింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై విచారణ ఊపందుకుంది. ఈ ప్రాజెక్టును “బీఆర్ఎస్‌కు ఏటీఎం”గా అభివర్ణించిన కేంద్రమంత్రి బండి సంజయ్, కేసీఆర్ కుటుంబం ఈ ప్రాజెక్టు ద్వారా వందల కోట్లు సంపాదించిందని ఆరోపించారు. మరోవైపు ఫార్ములా వన్ రేస్ లో అవకతవకలపై ఇప్పటికే కేసు నమోదైంది. ఇందులో కేటీఆర్ పాత్రపై ఆరోపణలున్నాయి. రేవంత్ ప్రభుత్వం ఈ ఆరోపణలపై కేసులు నమోదు చేస్తూ బీఆర్ఎస్ నేతలపై ఒత్తిడి పెంచుతోంది. ఇది పార్టీకి చట్టపరమైన, రాజకీయ సవాళ్లను తెచ్చిపెట్టింది.
బీఆర్ఎస్‌కు మరో పెద్ద ముప్పు బీజేపీ నుంచి వస్తోంది. బీజేపీ తెలంగాణలో పట్టు పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం బీఆర్ఎస్ నుంచి కీలక నేతలను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు బీజేపీలో చేరారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 10 మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమయ్యారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ఈ వ్యూహాన్ని మరింత ఉద్ధృతం చేస్తోంది. ఈ పరిణామాలు బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు.
బీఆర్ఎస్ పతనానికి కేసీఆర్ కుటుంబ అహంకారం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. కేటీఆర్, కవిత చేసిన కొన్ని వ్యాఖ్యలు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నాయకులపై, రేవంత్ రెడ్డిపై విమర్శలు ప్రజల్లో వ్యతిరేకతను రేకెత్తించాయి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసిన బీఆర్ఎస్, ఇప్పుడు ఆ సెంటిమెంట్ కోల్పోయి, కొత్త తరం ఓటర్లను ఆకర్షించడంలో విఫలమవుతోంది. అందుకే మళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీసి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఒకప్పుడు అజేయ శక్తిగా ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కుటుంబ విభేదాలు, చట్టపరమైన సవాళ్లు, బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వల్ల నాయకులు రాజీనామా చేసే అవకాశం, ప్రజల్లో తగ్గుతున్న మద్దతు.. ఇవన్నీ బీఆర్ఎస్‌ను బలహీనపరుస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్‌కు కీలక పరీక్షగా మారనున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడి, పూర్వ వైభవాన్ని తిరిగి సాధించాలంటే, కేసీఆర్ నాయకత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.