Banakacherla: బనకచర్ల లింక్ ప్రాజెక్టు వెనుక గూడుపుఠాణి..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై (Godavari Banakacherla Link Project) తెలంగాణ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పుడు ఏపీలో కూడా కొంతమంది నీటిపారుదల నిపుణులు, విద్యావంతులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నీటిని కృష్ణా నది ద్వారా పెన్నా నదికి మళ్లించి, నంద్యాల జిల్లాలో బనకచర్ల వద్ద భారీ రిజర్వాయర్ నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ ప్రాజెక్టుపై నీటిపారుదల నిపుణులు, విద్యావంతులు, తెలంగాణ రాజకీయ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీటిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు అందించేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. దాదాపు 82వేల కోట్ల రూపాయలతో నిర్మించే ఈ ప్రాజెక్టు 200 టీఎంసీల వరద జలాలను వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సముద్రంలోకి వృథాగా పోతున్న 3వేల టీఎంసీల గోదావరి నీటిలో కేవలం 200 టీఎంసీని మాత్రమే ఈ ప్రాజెక్టుకు ఉపయోగించుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) వెల్లడించారు. దీని వల్ల తెలంగాణ హక్కులకు ఎలాంటి భంగం కలిగదని వాదిస్తున్నారు.
నీటిపారుదల నిపుణులు, మాజీ అధికారులతో కూడిన అలోచనపరుల వేదిక (Think Tank Forum) ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) ఆలోచనగా అని.. రాజకీయ-కాంట్రాక్టర్ల కూటమి ద్వారా ఇది మళ్లీ తెరపైకి వచ్చిందని వారు ఆరోపిస్తున్నారు. గోదావరి నీటిని కృష్ణా బేసిన్ ద్వారా పెన్నా బేసిన్‌కు మళ్లించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం కృష్ణా జలాలపై ఉన్న హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, ఈ ప్రాజెక్టు నిర్వహణ ఖర్చు ఎకరానికి సంవత్సరానికి 50 వేల రూపాయల వరకు ఉంటుందని, ఇది రాష్ట్రానికి భారీ ఆర్థిక భారం మోపుతుందని వారు అంచనా వేస్తున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) ఈ ప్రాజెక్టు రాయలసీమలో కొత్త ఆయకట్టును సృష్టించదని, బదులుగా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను దెబ్బతీస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీటిపారుదల నిపుణుడు లక్ష్మీనారాయణ (Lakshmi Narayana) రాయలసీమలోని ఇతర ప్రాజెక్టులు చట్టబద్ధత కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. పైగా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే బనకచర్లను తెరపైకి తీసుకురావడం తప్పని వారు ఖండిస్తున్నారు.
మరోవైపు… తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్-2014, గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యూనల్-1980 (GWDT) నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి, ఈ ప్రాజెక్టు ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నీటి వివాదాల చుట్టూనే జరిగిందని, ఈ ప్రాజెక్టు తమ రిపేరియన్ హక్కులను కాలరాస్తుందని వారు వాదిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు హాని కలిగించదని, కేవలం వరద జలాలను వినియోగిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ అభ్యంతరాలను నివృత్తి చేయడానికి కేంద్ర మధ్యవర్తిత్వంతో చర్చలు జరపాలని ఆయన సూచించారు.
బనకచర్ల లింక్ ప్రాజెక్టు రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ప్రారంభమైనప్పటికీ, ఇది రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ, చట్టపరమైన వివాదానికి దారితీసింది. తెలంగాణ ఈ ప్రాజెక్టును చట్టపరంగా సవాలు చేయడానికి సిద్ధమవుతుండగా, ఆంధ్రప్రదేశ్ తమ హక్కులను సమర్థిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ వివాదంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు భవిష్యత్తు రెండు రాష్ట్రాల నీటి హక్కులు, రాజకీయ సమన్వయంపై ఆధారపడి ఉంది.