KTR: ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు..!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా-ఈ రేసు (Formula E-Race Case) కేసులో ఆయనను సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఆదేశించింది. ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారంది. గతంలోనే కేటీఆర్ (KTR) ఓసారి విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు మళ్లీ నోటీసులు ఇవ్వడంతో ఆయన పాత్రపై ఆరోపణలు, విచారణ పురోగతి రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఫార్ములా-ఈ కార్ రేసు 2022-23లో హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆర్థిక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఈ కేసు మొదలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, ఈ రేసు నిర్వహణ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నుంచి సుమారు 45 కోట్ల రూపాయలు బ్రిటన్‌కు చెందిన ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (FEO) కంపెనీకి బదిలీ చేశారు. అయితే, ఈ చెల్లింపులకు ఆర్థిక శాఖ, క్యాబినెట్ అనుమతులు తీసుకోలేదని, నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. ఈ రేసుతో హెచ్‌ఎండీఏకు సంబంధం లేకపోయినా, ఆ సంస్థ నిధులు ఉపయోగించడం వివాదాస్పదమైంది. పురపాలక శాఖ మాజీ మంత్రిగా కేటీఆర్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షించారు. నిధుల మంజూరుకు ఆయన ఆదేశాలు ఇచ్చారని ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ కేసులో కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా (A1), పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌ను A2గా, ఇతర అధికారులను ఇతర నిందితులుగా ఏసీబీ పేర్కొంది.
ఈ కేసులో ఏసీబీ గతంలోనే కేటీఆర్‌ను విచారించింది. ఈ ఏడాది జనవరి 6న సుమారు 7 గంటల పాటు జరిగిన ఈ విచారణలో, రేసు నిర్వహణ కోసం తానే నిధులు మంజూరు చేయాలని ఆదేశించినట్లు కేటీఆర్ ఒప్పుకున్నారని సమాచారం. అయితే సమయాభావం వల్ల అనుమతుల గురించి ఆలోచించలేదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విచారణ సందర్భంగా కేటీఆర్ తన లాయర్లను తీసుకెళ్లడం, విచారణ ప్రక్రియపై ఆక్షేపణలు లేవనెత్తడం వివాదాస్పదమైంది. ఆయన విచారణకు పూర్తిగా సహకరించలేదని ఏసీబీ అధికారులు భావించారు.
ఈ కేసులో కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్ అనుమతి కోరగా, 2024 నవంబర్‌లో అనుమతి లభించింది. అయితే కేటీఆర్ ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు 2024 డిసెంబర్ 27న ఆయనను జనవరి 31, 2025 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. తర్వాత సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయగా, ఈ కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది.
తాజాగా జారీ చేసిన నోటీసులతో ఏసీబీ మరింత లోతుగా విచారణ చేపట్టాలని భావిస్తోంది. నిధుల బదిలీలో నిబంధనల ఉల్లంఘన, అధికార దుర్వినియోగం ఆరోపణలపై స్పష్టత కోసం కేటీఆర్‌ను మరోసారి ప్రశ్నించనున్నారు. ఈ కేసు రాజకీయంగా సున్నితాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసును బీఆర్ఎస్‌పై ఒత్తిడి తెచ్చే అస్త్రంగా ఉపయోగిస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచే ఉద్దేశంతో ఈ రేస్ నిర్వహించామని, నిధులు పారదర్శకంగా ఖర్చు చేశామని కేటీఆర్ వాదిస్తున్నారు. ఈ కేసు తనను రాజకీయంగా ఇరకాటంలో పెట్టే కుట్ర అని ఆయన ఆరోపిస్తున్నారు. సోమవారం విచారణలో కేటీఆర్ సహకరిస్తారా, లేక మరోసారి రాజకీయ డ్రామా చోటు చేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ కేసు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయనుంది.