హైదరాబాద్ లో టీసీఎస్ మరో సెంటర్
దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) హైదరాబాద్లో మరో సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నది. వచ్చే ఆరు నుంచి ఏడు నెలల్లో అందుబాటులోకి రానున్న ఈ సెంటర్లో 700 మంది కూర్చోవడానికి వీలుంటుందని కంపెనీ సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రీజినల్ బిజినెస్ హెడ్ వీ రాజన్న తెలిపారు. ఐటీ రంగ వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లనే మరో సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్లో ఏడు సెంటర్లు ఉండగా, ఈ ఏడాది చివరినాటికి ఈ ఎనిమిదో సెంటర్ అందుబాటులోకి రానున్నదన్నారు. పదిహేనేండ్ల క్రితం 4 వేల మంది ఐటీ ఉద్యోగులు కలిగిన టీసీఎస్ ప్రస్తుతం 90 వేలకు చేరుకున్నారన్నారు. రాష్ట్ర ఐటీ ఎగుమతులు టీసీఎస్ వాటా అంతకంతకు పెరుగుతున్నది. ఐటీ ఎగుమతుల్లో టీసీఎస్ వాటా 10 శాతం నుంచి 12 శాతం వరకు ఉన్నదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆదిబట్ల క్యాంపస్లో 15`16 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, ఈ సెంటర్లో మరో 8 వేల మంది సిబ్బంది కూర్చోవడానికి వీలుంటుందన్నారు.






