YCP: వరుస నోటీసులతో కష్టాలలో వైసీపీ నేతలు..

వైసీపీకి (YCP) సంబంధించి పాత కేసులు ఇంకా పూర్తిగా ముగియలేదనే మాట ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు మారింది. ఆ పార్టీ హయాంలో చోటుచేసుకున్న వివాదాస్పద ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో, కీలక నేతలు ఒకరొక్కరుగా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా లిక్కర్ స్కాం కేసులు వైసీపీ నేత మిథున్ రెడ్డి (Mithun Reddy) ని అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మాజీ ఎక్సైజ్ మంత్రి కిళత్తూరు నారాయణ స్వామి (Killattur Narayana Swamy)పైనా కూడా సిట్ అధికారుల దృష్టి వెళ్లింది అని టాక్.
జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్సైజ్ శాఖను నారాయణ స్వామి నేతృత్వం వహించారు. అప్పటి మద్యం సరఫరా విధానాలపై తీవ్ర ఆరోపణలు వస్తుండగా, దానిపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక బృందం (SIT) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విజయవాడ (Vijayawada) లోని కార్యాలయానికి హాజరై విచారణకు సహకరించాల్సిందిగా కోరారు. ఆయన అరెస్టు కూడా జరిగే అవకాశముందని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక గత నెలలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామంలో జగన్ పర్యటించిన సమయంలో, ఆ ప్రాంతంలో పోలీసులు విధించిన ఆంక్షలను వైసీపీ నాయకులు పాటించకపోవడంతో మరో వివాదం మొదలైంది. అనుమతులు లేకుండానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరించినట్టు సమాచారం. ‘రప్పా రప్పా’ పోస్టర్లతో అక్కడ ఉద్రిక్తత నెలకొల్పే ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ ఘటనలో చిలకలూరిపేట (Chilakaluripet) మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ (Vidadala Rajini)కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఆమెను విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. ఎంత మంది ప్రజలను అక్కడికి తరలించారని, ఆమె పాత్ర ఏంటనే అంశంపై సూటిగా ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు కూడా నోటీసులు ఇచ్చారు. ఆయనపై కార్యకర్తల సమీకరణతో పాటు, పోలీసులు విధుల్లో ఉన్న సమయంలో దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన పాత వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ, అప్పటి అధికారంలో ఉన్న నేతలు ఇప్పుడు పోలీసుల ముందు నిలబడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మొత్తానికి వైసీపీ నేతలు వరుస నోటీసులతో ఫుల్ బిజీగా మారిపోయారు.