Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం (fake Liquor) తయారీ కేసు కీలక మలుపు తీసుకుంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య అదుపులోకి తీసుకున్న అధికారులు, ఆయన్ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఈ అరెస్ట్ ను వైసీపీ నేతలు ఖండించారు. కక్ష సాధింపుతోనే జోగి రమేశ్ ను అరెస్టు చేసినట్లు ఆరోపించారు.
కల్తీ మద్యం తయారీ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్ధన్ రావు (Addepalli Janardhan Rao) ఇచ్చిన వాంగ్మూలమే జోగి రమేశ్ అరెస్టుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. నకిలీ మద్యం తయారీ వెనుక మాజీ మంత్రి ప్రోద్బలం ఉందని, ఆయన ఆదేశాల మేరకే ఈ దందా కొనసాగించామని జనార్ధన్ రావు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. నకిలీ మద్యం తయారీని కొనసాగించడానికి జోగి రమేశ్ తనకు పూర్తి ప్రోత్సాహం అందించారని జనార్ధన్ రావు పేర్కొన్నారు. ఇందుకోసం సుమారు రూ. 3 కోట్లు ఆర్థిక సాయం చేస్తానని జోగి రమేశ్ హామీ ఇచ్చారని చెప్పారు. దీంతో ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని జోగి రమేశ్ తనకు ఆశ కల్పించినట్లు జనార్ధన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాకుండా, నకిలీ మద్యం తయారీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి తాను వెళ్లిన సీసీ కెమెరా ఫుటేజీ, ఇతర ఆధారాలను కూడా జనార్ధన్ రావు సిట్‌కు సమర్పించినట్లు సమాచారం. ఈ ఆధారాల నేపథ్యంలోనే అధికారులు అరెస్ట్‌కు ఉపక్రమించారు.
జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్టుతో కల్తీ మద్యం తయారీ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన నిందితుల సంఖ్య 20కి చేరింది. ఈ కేసులో ప్రధానంగా బెంగుళూరు నుంచి స్పిరిట్‌ను దిగుమతి చేసుకుని, ఇబ్రహీంపట్నం, ములకలచెరువు వంటి ప్రాంతాలలో నకిలీ మద్యం తయారు చేసి, మార్కెట్లో విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్‌ను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదని వారు ఆరోపిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన తమ నేతను దురుద్దేశంతోనే ఈ కేసులో ఇరికించారని, నకిలీ మద్యం కేసును అడ్డం పెట్టుకుని రాజకీయంగా వేధిస్తున్నారని వారు విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఈ అరెస్ట్‌పై వివరణ ఇవ్వాలని, కేసు విచారణలో పారదర్శకత పాటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.







