YS Jagan: “రేపు మేమొస్తే మీ పరిస్థితి ఏంటి..?” చంద్రబాబుకు జగన్ సీరియస్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారాయని, రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షంగా వైసీపీ (YCP) మాత్రమే ప్రజల సమస్యలపై స్పందిస్తోందని, ప్రజల తరఫున పోరాడటం తమ రాజ్యాంగ హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన జగన్, ముఖ్యమంత్రి చంద్రబాబుపై (CM Chandrbabau), ఆయన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై (NDA Govt) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సూపర్ సిక్స్ (Super Six) సహా 143 హామీలతో ప్రజలను మోసం చేశారని, రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్, సంజయ్, సనీల్, కాంతిరాణా, విశాల్ గున్నీలపై తప్పుడు కేసులు బనాయించారని, 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారని, వందల మంది పోలీసులను వీఆర్‌కు పంపారని విమర్శించారు. యంగ్ ఐపీఎస్ అధికారులు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మాఫియా డాన్ స్థాయికి దిగజారిందని ఆరోపించారు. పోలీసులు డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యేలకు, చంద్రబాబు, లోకేష్‌లకు వాటా ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
గుడివాడలో జడ్పీ ఛైర్‌పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారికపై టీడీపీ కార్యకర్తలు పాశవికంగా దాడి చేశారని, పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని జగన్ ఆరోపించారు. హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టారని, వీడియో ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆయన ఆరోపించారు. “ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా?” అని ప్రశ్నించిన జగన్, చంద్రబాబు యాక్టింగ్ ముందు ఎన్టీఆర్ కూడా తక్కువేనని వ్యాఖ్యానించారు. సినిమా డైలాగుల విషయంలో కూడా జగన్ తన వైఖరిని సమర్థించుకున్నారు. సినిమా డైలాగులు, పోస్టర్లు ప్రదర్శించినందుకు కేసులు పెట్టడం దారుణమని, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో ఇంతకంటే దారుణమైన డైలాగులు ఉన్నాయని, వాటిని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. సెన్సార్ బోర్డు ఉన్నప్పుడు సినిమా డైలాగులపై కేసులు పెట్టడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, రైతు భరోసా లేకపోవడం, విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయని, కరెంట్ చార్జీల రూపంలో రూ.15 వేల కోట్ల భారం ప్రజలపై మోపారని జగన్ విమర్శించారు.
చంద్రబాబు ప్రభుత్వం మరో మూడేళ్లలో పోతుందని, రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని జగన్ ధీమా వ్యక్తం చేశారు. “మీరు నాటిన విత్తనం పండుతుంది. రేపు మా ప్రభుత్వం వచ్చాక, మా వాళ్లను ఆపలేని పరిస్థితి వస్తే, చంద్రబాబు మీ పరిస్థితి ఏమిటి?” అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల తరఫున తమ పోరాటం ఆగదని, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోవాలని, లేకపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. వైసీపీ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, “బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ” నినాదంతో చంద్రబాబు మోసాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని జగన్ తెలిపారు. రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులను, అధికార దుర్వినియోగాన్ని ప్రజలు క్షమించరని, తమ ప్రభుత్వం పీపుల్ ఫ్రెండ్లీగా ఉండేదని, అధికారులు తలెత్తుకుని పనిచేసేవారని జగన్ అన్నారు.