Jagan: ఫ్యూచర్ కి వైసీపీ కొత్త స్ట్రాటజీ..అంతా మీదే అంటున్న జగన్..

2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎదుర్కొన్న పరాజయం తర్వాత పార్టీ లోపల కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) సంక్షేమ కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. వాలంటీర్ల వ్యవస్థనే పార్టీ భవిష్యత్తు అని నమ్ముకున్నారు. కానీ ప్రజల తీర్పు మాత్రం వేరేలా వచ్చింది. ఎన్నడూ లేని విధంగా పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఈ ఫలితాలతో వైసీపీలో అంతర్మథనం మొదలై ఇప్పుడు క్రమంగా పార్టీ పునర్నిర్మాణ దిశగా కదులుతోంది.
ఎన్నికల్లో భారీ యాంటీ ఇంకంబెన్సీ ఉన్నప్పటికీ వైసీపీకి 40 శాతం ఓటు షేర్ రావడం గమనార్హం. దీనిని జగన్ పూర్తిగా పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టి వారిని ప్రశంసించారు. “మీరు లేకుంటే వైసీపీ లేదు” అని స్పష్టంగా చెప్పడం ద్వారా ఆయన బలమైన సంకేతం ఇచ్చారు. గత పద్నాలుగు సంవత్సరాలుగా పార్టీని నిలబెట్టింది కూడా ఈ కేడర్‌నే అని ఆయన అభిప్రాయం.
జగన్ ఇప్పుడు మరింతగా క్యాడర్‌ను ప్రోత్సహిస్తూ ఐడీ కార్డులు ఇస్తామని, భవిష్యత్తులో పదవుల్లో వారికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీని గ్రామస్థాయి వరకు బలంగా నిర్మించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామంలో మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాలకూ ప్రత్యేక విభాగాలు ఉండాలని ఆయన కోరారు. ఈ విధంగా పటిష్టమైన యంత్రాంగం ఏర్పడితేనే పార్టీ బలంగా నిలుస్తుందని ఆయన స్పష్టంచేశారు.
డిసెంబర్ లోపల ప్రతి నియోజకవర్గంలో బలమైన కమిటీలు ఉండాలని, ఆ పనిని పూర్తి చేయని ఇన్‌ఛార్జిలను పదవుల నుంచి తప్పిస్తామని కూడా జగన్ కఠిన హెచ్చరిక ఇచ్చారు. దీని ద్వారా ఆయన పార్టీని క్రమశిక్షణలో ఉంచాలని చూస్తున్నారని స్పష్టమవుతోంది.
వైసీపీ అధికారంలోకి వస్తే పాలన మీరు చెప్పినట్టే ఉంటుంది అని క్యాడర్‌కి జగన్ నమ్మకమిచ్చారు. గ్రామస్థాయినుంచే పాలనను నడిపిస్తామని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నింటిలో కూడా కార్యకర్తలే ముందుంటారని చెప్పారు. ఈ విధంగా భవిష్యత్తులో కార్యకర్తలతోనే పార్టీ వ్యవస్థ నడుస్తుందని ఆయన సూచించారు.
దీంతో చాలామంది జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధానాన్ని పాటించి ఉంటే వైసీపీ ఈ స్థాయిలో ఓటమి పాలయ్యేది కాదని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న మార్పులు పార్టీకి పాజిటివ్‌గానే ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి వైసీపీ ఇప్పుడు కొత్త దిశలో నడుస్తున్నట్లుంది. బాటమ్ టూ టాప్ విధానమే పార్టీ భవిష్యత్తు వ్యూహమని చెప్పబడుతోంది. అట్టడుగు స్థాయి నుంచి నిర్ణయాలు రావాలని, పైస్థాయికి చేరాలని వైసీపీ ఆకాంక్షిస్తోంది. ఈ మార్పులు ఎంతవరకు ఫలిస్తాయో రానున్న కాలంలో తెలుస్తుంది.