ధాన్యం సేకరణ అంతా ప్రభుత్వమే చూసుకోవాలి : సీఎం జగన్

ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండరాదని ఏపీ సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం ఏ మిల్లుకు పంపాలన్నది అధికారులే నిర్ణయించాలని సూచించారు. అవసరమైతే జిల్లాల కలెక్టర్లు సొంతంగా గోనె సంచులు సేకరించాలని సూచించారు. మిల్లుల వద్దకు ధాన్యం రవాణా చేయడంలో వ్యయం నియంత్రణ కోసం ఊరికి దగ్గర్లోని మిల్లర్ వద్దకు పంపవద్దని, బదులుగా జిల్లా యూనిట్‌గా తీసుకొని, ధాన్యాన్ని మిల్లులకు పంపాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వమే దగ్గరుండి నిర్వహించాలని జగన్ ఆదేశించారు. ‘ఇంటింటికీ రేషన్ బియ్యం’ పై సీఎం జగన్ అధికారులతో తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పక్కాగా ధాన్యం సేకరణ జరగాలని, రైతుకు ఎక్కడా నష్టం రాకూడదని పేర్కొన్నారు.
వ్యవసాయ సలహా కమిటీని క్రియాశీలం చేయాలి….
రాష్ట్రంలోని వ్యవసాయ సలహా కమిటీలను క్రియాశీలం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. వారికి అన్ని అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. క్రాప్ ప్లానింగ్ మొదలుకొని, అన్ని అంశాల్లో వీరు రైతులకు అండగా నిలవాలని సూచించారు. ఈ ప్రక్రియలో మహిళలకు కూడా భాగస్వామ్యం కల్పించాలన్నారు. అంతేకాకుండా వ్యవసాయ సలహా కమిటీల బాధ్యతలు, పనితీరుపై నిరంతరం సమీక్షలు చేస్తూ ఉండాలని, ఇదంతా పౌరసరఫరాల మంత్రి పర్యవేక్షణలోనే జరగాలన్నారు.