YS Jagan: బనకచర్ల ప్రాజెక్టుపై నోరు విప్పిన జగన్..! ఆయన ఏమన్నారంటే..!?

ఆంధ్రప్రదేశ్‌లో జలవనరుల వినియోగం, పోలవరం (Polavaram), బనకచర్ల (Banakacherla) ప్రాజెక్టుల చుట్టూ రాజకీయ, సాంకేతిక చర్చలు ఊపందుకున్నాయి. గోదావరి నది జలాలను రాయలసీమకు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు, రాష్ట్రంలో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) చెప్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) ఆందోళనలు వ్యక్తం చేస్తూ, దీని సాధ్యాసాధ్యాలపై పలు అంశాలను లేవనెత్తారు.
పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా చెప్పుకుంటున్నారు. గోదావరి నదిపై నిర్మితమవుతున్న ఈ బహుళార్థసాధక జలాశయం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించడంతోపాటు, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సరఫరాకు కీలకం. కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. అయితే, ఈ ప్రాజెక్టు జలాశయం ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోకి విస్తరించడంతో, ఈ రాష్ట్రాలతో నీటి వినియోగంపై వివాదాలు తలెత్తాయి.
గోదావరి నదికి ప్రధాన ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదులపై ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు చేపడుతున్న ప్రాజెక్టులు, పోలవరం వద్ద మిగులు నీటి లభ్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఛత్తీస్‌గఢ్‌లో ప్రాణహిత-ఇంద్రావతి జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం 50 వేల కోట్లు కేటాయించడం, గోదావరి జలాల దిగువ ప్రవాహాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో, పోలవరం ద్వారా బనకచర్లకు నీటిని మళ్లించడానికి తగినంత మిగులు జలాలు అందుబాటులో ఉంటాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
పోలవరం ఆనకట్ట ఎత్తు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం రాజీ పడినట్లు జగన్ ఆరోపించారు. మొదట 45.72 మీటర్ల ఎత్తుకు ఆమోదం లభించినప్పటికీ, దానిని 41.15 మీటర్లకు తగ్గించడానికి అంగీకరించారని, దీనివల్ల ఆనకట్ట పూర్తి నిల్వ సామర్థ్యం సాధించలేదని ఆయన విమర్శించారు. ఈ ఎత్తు తగ్గింపు వల్ల ప్రాజెక్టు ద్వారా తగినంత నీటిని నిల్వ చేయడం, ఇతర ప్రాంతాలకు మళ్లించడం సాధ్యం కాదని జగన్ హెచ్చరించారు. ఈ నిర్ణయం జగన్ హయాంలోనే తీసుకున్నట్లు కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆయన ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వంపై బాధ్యత నెట్టారు.
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా గోదావరి వరద జలాలను ప్రకాశం బ్యారేజి, బొల్లాపల్లి జలాశయం ద్వారా బనకచర్లకు తరలించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల మందికి తాగునీరు, 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా 3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,112 కోట్లుగా ఉండగా, జగన్ దీనిని ఆర్థికంగా వృథా చేయడమేనని విమర్శించారు. తగినంత మిగులు జలాలు లేకుండా ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం ప్రజా ధనాన్ని వృధా చేయడమేనని ఆయన హెచ్చరించారు.
చంద్రబాబు ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును సీరియస్‌గా తీసుకోగా, వైసీపీ దీనిపై ఇన్నాళ్లూ నోరు మెదపలేదు. దీంతో జగన్‌పై అనుమానాలు తలెత్తాయి. కొందరు ఈ ప్రాజెక్టు జగన్ హయాంలోనే ప్రతిపాదించారని, ఆయన తన అనుయాయుల లబ్ది కోసం దీనిని సమర్థిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, జగన్ తాజా వ్యాఖ్యలు ఈ అంశంపై సమగ్ర అధ్యయనం, బాధ్యతాయుతమైన వైఖరి అవసరమని నొక్కి చెప్పాయి.