YCP vs TDP: జూలై లో వైసీపీ vs టీడీపీ .. ప్రజల్లోకి దిగేందుకు సిద్ధమైన నేతలు

జూలై 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ రంగంలో వేడి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ (TDP) కూటమి మరియు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మధ్య హోరాహోరి పోటీ మొదలుకానుంది. ఇరు పక్షాలు ఇంటింటికీ వెళ్లి ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ప్రజలకు తమ తమ ప్రభుత్వాల పాలనను వివరిస్తూ, వ్యతిరేక పార్టీపై విమర్శల జల్లు కురిపించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటికే ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) నేతృత్వంలోని వైసీపీ “రికాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో” (,Recalling Chandrababu manifesto) పేరిట ఇంటింటికీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొన్ని జిల్లాల్లో ఇది ప్రారంభమైనప్పటికీ, ఇతర ప్రాంతాల్లో నాయకులు పెద్దగా స్పందించకపోవడంతో, జగన్ ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆయన వ్యక్తిగతంగా ఫోన్లు చేసి నాయకుల పనితీరును తెలుసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే వచ్చే రోజుల్లో వైసీపీ ప్రచారం మరింత ఉత్సాహంగా సాగనుందనడం తప్పుకాదు.
ఇక మరోవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం “ఇది మంచి ప్రభుత్వం” (Idi manchi Prabhutvam) అనే పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. జూలై 2వ తేదీ నుంచి ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది. గత ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి పనులు, పెట్టుబడుల రాక, సంక్షేమ పథకాలు మొదలైన విషయాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా పార్టీ నాయకులందరూ పాల్గొననున్నారు. చంద్రబాబు స్వయంగా మొదటి వారం గ్రామాల్లో పర్యటించి ఈ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. నియోజకవర్గాల వారీగా నేతలు ప్రజల్లోకి వెళ్లాలని ఆయన ఆదేశించారు. అంతేకాదు, ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న స్థానిక నాయకులకు భవిష్యత్తులో పదవుల అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇరు పక్షాల కార్యక్రమాలు ఒకేసారి ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాజకీయ రంగం మరింత వేడెక్కనుంది. టీడీపీ ప్రభుత్వం పోలీసు శాఖను కూడా అప్రమత్తం చేసింది. ఎక్కడైనా వైసీపీ నేతలు అడ్డుగా మారితే తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చినట్లు సమాచారం. దీనికి సమాధానంగా వైసీపీ నేతలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్దంగా ఉండాలని, ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లాలని ఆదేశించబడినట్లు తెలుస్తోంది. దీంతో జూలై 2వ తేదీ నుంచి రాష్ట్రంలో రాజకీయ సమరం మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి.