వైసీపీని టెన్షన్ పెడుతున్న విశాఖ.. ఈసారి గెలుపు ఎవరిదో…

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసిపి పార్టీకి ప్రస్తుతం విశాఖ ప్రెస్టేజ్ పాయింట్ గా మారుతుంది. జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా విశాఖపట్నం అంటే అభిమానం జాస్తి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది.. ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పూర్తిగా చతికిలపడింది. అయినా ఇంకా అక్కడ స్థానిక సంస్థలలో వైసిపి జెండా ఎగురుతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మహా విశాఖ నగరపాలక సంస్థ మేయర్ పదవి వైసీపీ నేత హరి వెంకట కుమారి నిర్వహిస్తున్నారు. మరొకక విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా కూడా వైసీపీ పార్టీకి చెందిన సుభద్ర ఉన్నారు. అంతేకాకుండా మండల పరిషత్తులు, మునిసిపాలిటీలలో సైతం వైసీపీ హవా నడుస్తోంది. అయితే ఇది నిన్నటి వరకు మాట.. అధికారం నుంచి వైసీపీ దిగిపోవడం.. కూటమి అధికారంలోకి రావడం తో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పక్క చూపులు చూడడం మొదలుపెట్టారు.
ఇప్పటికే కొంతమంది సైకిల్ కి జై కొట్టగా.. మరి కొంతమంది గ్లాస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం విశాఖ కార్పొరేషన్ లో జగన్ పార్టీకి 58 మంది కార్పొరేటర్ల బలం ఉంది. అయితే అది ఇప్పుడు 40 దాకా పడిపోయింది. ఇందులో 12 మంది కార్పొరేటర్లు కూటమివైపు అడుగులు వేయగా.. మిగిలిన వారు జనసేన బాట పట్టారు. ఆగస్టు 7న స్థాయి సంఘం ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వైసీపీలో కసరత్తులు మొదలయ్యాయి. ఇప్పటికే మూడేళ్లుగా జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో పదికి పది చైర్మన్ పదవులను వైసీపీ తన ఖాతాలో వేసుకుంటూ వచ్చింది.
కానీ ఈసారి మాత్రం కూటమి నుంచి పోటీ చాలా గట్టిగా ఉంది. మొత్తం 24 నామినేషన్లు స్టాండింగ్ కమిటీ పదవులకే పడ్డాయి. దీంతో జగన్ కూడా ఈ విషయాన్ని బాగా సీరియస్ గా తీసుకున్నారు అని టాక్. అందుకే తాడేపల్లికి రమ్మని కార్పొరేటర్లకి కబురు కూడా పెట్టారట. ఇంకేముంది కబురు అందిన వెంటనే రెండు బస్సులు వేసుకొని 40 మంది కార్పొరేటర్లు బయలుదేరి వెళ్లారు. ఈసారి స్థాయి సంఘం ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది. కూటమిని ఎలాగైనా స్థాయి సంఘం ఎన్నికల్లో దెబ్బతీసి జీవీఎంసీ పై పట్టు సాధించాలి అన్న దిశగా వైసీపీ అడుగులు వేస్తుంది. మరి ఇందులో కూడా కూటమి విజయ డంకా మోగిస్తుందా లేక వైసిపి ఆధిపత్యం చలాయిస్తుందా అన్న విషయం చూడాలి.
.