YSRCP: మోడీ గారూ, పోలీసులను వేధిస్తున్నారు, మోడీకి వైసీపీ ఎంపీ లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు అధికారులను వేధిస్తున్నారని వైఎస్‌ఆర్‌సిపి ఎంపి మద్దిల గురుమూర్తి ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)కి లేఖ రాశారు. మోడీతో పాటుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ప్రధాన కార్యదర్శి జి. విజయానంద్, డిజిపి హరీష్ కుమార్ గుప్తాలకు ఈ లేఖ రాసారు. జూన్ 2024 నుండి ఆంధ్రప్రదేశ్‌లో 199 మంది సీనియర్ పోలీసు అధికారులకు పోస్టింగ్‌లు లేదా జీతాలు లేకుండా ఉంచి రాజ్యాంగ విరుద్దంగా వారిని వేధిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ 199 మంది అధికారులలో 4 మంది ఐపిఎస్ అధికారులు, 4 మంది నాన్-క్యాడర్ పోలీసు సూపరింటెండెంట్లు, 1 ఎపిఎస్‌పి కమాండెంట్, 27 మంది అదనపు ఎస్పీలు, 42 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు ఆఫ్ పోలీస్ (డిఎస్‌పిలు) (సివిల్ అండ్ ఎపిఎస్‌పి), మరియు 119 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారని లేఖలో వివరించారు. వారందరినీ వేకెన్సీ రిజర్వ్ (VR) జాబితాలో ఉంచారని వెల్లడించారు. ఎటువంటి అధికారిక పోస్టింగ్‌లు, బాధ్యతలు లేదా వేతనం లేకుండా మంగళగిరిలోని డీజీపీ (DGP) కార్యాలయానికి ఏకపక్షంగా అటాచ్ చేశారని తెలిపారు.
ఈ అధికారులు రోజుకు రెండుసార్లు హాజరు కావాలన్ని.. వారి స్వంత ఖర్చుతో అద్దె వసతి గృహాలలో నివసిస్తున్నారని, వారికి ఏడాదికి పైగా జీతం చెల్లించలేదని డాక్టర్ గురుమూర్తి లేఖలో ఆరోపించారు. వారిపై ఎటువంటి శాఖాపరమైన లేదా చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో లేవని పేర్కొన్నారు. అయినప్పటికీ, వారికి ఎటువంటి వాహనాలు, భత్యాలు లేదా గుర్తింపు ఇవ్వకుండా రాజకీయ బందోబస్తు, వీఐపీ విధులు, ప్రజా కార్యక్రమాలకు అనధికారికంగా భద్రతలో వినియోగిస్తున్నారని.. దీనివల్ల అవమానం, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని లేఖలో వివరించారు.
ప్రభుత్వం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16 మరియు 21, ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2006)లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. పోస్టింగ్‌లను పునరుద్ధరించడానికి, పెండింగ్‌లో ఉన్న జీతాలు, ప్రయోజనాలను రిలీజ్ చేసేందుకు, పెన్షన్లను తిరిగి చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.