Ys Jagan: జగన్ ఆ మాట మాట్లాడకపోవడమే మంచిదా..?

దాదాపు నెల రోజుల క్రితం వైయస్ జగన్ చేసిన సత్తెనపల్లి పర్యటన.. ఇప్పటికీ వైసీపీని రాజకీయంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఆ పర్యటనలో వైసీపీ(YSRCP)కార్యకర్తల ప్రదర్శించిన ఫ్లెక్సీలు పై తీవ్ర వివాదం రేగింది. కొంతమంది వైసిపి కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిపై సీరియస్ అయింది. టిడిపి సోషల్ మీడియా.. వైసిపి మనస్తత్వం ఇది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. ఇక టిడిపి(TDP) నాయకులు కూడా వైసీపీని లక్ష్యంగా చేసుకోవడానికి ఆ ప్రకటనలను వాడుకుంటున్నారు.
ఇక వైసిపి నాయకులు కూడా అవకాశం దొరికిన ప్రతిసారి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాల నాయకులు పదేపదే దీని గురించి మాట్లాడటం కాస్త ఇబ్బంది పెట్టే అంశంగానే చెప్పాలి. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో.. అల్లు అర్జున్(Allu Arjun) వాడిన రప్ప రప్ప అనే డైలాగును పదేపదే వైసిపి తమ మీడియా సమావేశంలో వాడే ప్రయత్నం చేస్తుంది. వైయస్ జగన్ కూడా దీని గురించి పదేపదే మాట్లాడుతూ వచ్చారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో కూడా ఆయన దీనిపై వ్యాఖ్యలు చేశారు.
అయితే దీనిపై రాజకీయ పరిశీలకులు వైసీపీని హెచ్చరిస్తున్నారు. ఈ విషయం గురించి వైసీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనే అభిప్రాయం ఎక్కువగా వినపడుతోంది. దీని కారణంగానే వైసిపి ప్రజల్లో చులకన అవుతుంది అనే భావన.. వైసిపి నీ అభిమానించే వారు కూడా వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు వైసిపి చేసే రాజకీయాలపై ప్రజల్లో చులకన భావం తీసుకొచ్చాయి. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో కొన్ని వివాదాస్పద ఘటనలు జరిగాయి.
కాబట్టి ఇప్పుడు అటువంటి వ్యాఖ్యలు చేస్తే అనవసరంగా ప్రజల్లో మరింత చులకన అవుతారని హెచ్చరిస్తున్నారు. వైసిపి వస్తే దాడులు జరుగుతాయి అనే సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయని, కాబట్టి రాష్ట్రానికి ఏం చేస్తామో చెప్పడమే మంచిది అని, ప్రభుత్వం పై సంస్థాగత విమర్శలు చేయడం మానేసి, ఒకటే అంశాన్ని పదే పదే మాట్లాడటం కరెక్ట్ కాదంటూ హెచ్చరిస్తున్నారు. అధినేతగా ఉన్న జగన్ కూడా వైసిపి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదనేది వారి అభిప్రాయం. ఇప్పటికే జగన్ ది ఫ్యాక్షనిస్టు మనస్తత్వం అనేది టిడిపి ప్రజల్లోకి తీసుకు వెళ్లిందని, కాబట్టి ఈ వ్యాఖ్యల గురించి మరింత సమర్ధించుకునే విధంగా మాట్లాడితే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.