Jagan: ఉత్తరాంధ్ర లో వైసీపీ భవిష్యత్తు పై జగన్ ఫోకస్ పెడతారా?
2019లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వైసీపీ (YSRCP) శక్తివంతంగా నిలిచి 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. కానీ 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురైన షాక్ ఇంకా తగ్గలేదు. మొత్తం రాష్ట్రంలో కేవలం 11 సీట్లు మాత్రమే సాధించడం వల్ల వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర (Uttarandhra) జిల్లాల్లో పరిస్థితి మరింత కష్టంగా మారింది. ఇక్కడి 34 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఖాతాలో పడినవి కేవలం రెండు మాత్రమే – అవి కూడా విశాఖ ఏజెన్సీ (Visakha Agency) పరిధిలోని పాడేరు (Paderu) , అరకు (Araku). అదృష్టవశాత్తూ అరకు పార్లమెంట్ (Araku Parliament) సీటు కూడా వైసీపీకే దక్కింది.
ఈ ఓటమి తరువాత ఉత్తరాంధ్ర వైసీపీలో నిస్సత్తువ ఎక్కువైందని అంటున్నారు. ఒకప్పుడు ఇక్కడ బలంగా పనిచేసిన మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఇతర కీలక పదవులు చేపట్టిన నేతలు ఎవరూ ఇప్పుడు గళం విప్పడం లేదు. పదిహేనునెలలుగా పార్టీ శ్రేణులు ఎలాంటి జోష్ చూపకపోవడం ఆందోళన కలిగిస్తోంది.అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం సీనియర్ నేతలకు, మాజీ మంత్రులకు పదవులు ఇచ్చింది. ముఖ్యంగా పీఏసీ (PAC) లాంటి కీలక మండలిలో ఉత్తరాంధ్ర నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయినప్పటికీ ఆ ప్రాంతం నుంచి ఉత్సాహం కనబడకపోవడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది.
ఇదిలా ఉండగా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఎన్నికల తరువాత పెద్దగా పర్యటనలు చేయకపోవడం కూడా ఇక్కడి కార్యకర్తల్లో అసంతృప్తి పెంచింది. ఆయన అప్పుడప్పుడూ పర్యటనలు చేసినా అవి రాయలసీమ (Rayalaseema), కోస్తా (Coastal Andhra) జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఉత్తరాంధ్ర వైపు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పార్టీ స్థితి మరింత బలహీనమైందని భావిస్తున్నారు.
ఇక మరో వైపు , టీడీపీ (TDP) కూటమి మాత్రం ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నారా లోకేష్ (Nara Lokesh) ముగ్గురూ అనేక సార్లు ఉత్తరాంధ్ర పర్యటనలు చేసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పర్యటించారు. నారా లోకేష్ క్రమం తప్పకుండా ప్రతి నెలా విశాఖ (Visakhapatnam) పర్యటిస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురూ కలిసి విశాఖలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం కూటమి శ్రేణులకు ఉత్తేజం ఇచ్చింది.
ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ సీట్లు ఏపీలో ఉన్న మొత్తం స్థానాల్లో ఐదవ వంతు. సీఎం అయ్యేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 88లో దాదాపు మూడొంతులు ఇక్కడి నుంచే వస్తాయి. అందుకే ఏ పార్టీకి అయినా ఉత్తరాంధ్రలో మెజారిటీ రావడం అంటే అధికారాన్ని ఖాయం చేసుకున్నట్టే. 2019లో వైసీపీ ఇక్కడ భారీ విజయాలు సాధించి అధికారంలోకి వచ్చింది. 2024లో మాత్రం టీడీపీ కూటమి 98 సీట్లు సాధించి పెద్ద విజయం సాధించింది. ఈ పరిస్థితుల్లో వైసీపీ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న వస్తోంది. జగన్ ఒకసారి ఈ ప్రాంతాన్ని పర్యటించి కార్యకర్తలతో కలిస్తే మళ్లీ ఉత్సాహం వస్తుంది అన్న టాక్ నడుస్తోంది. ఇక జగన్ ఉత్తరాంధ్ర పర్యటన ఎప్పుడనేది రాజకీయంగా కీలక చర్చగా మారింది.







