YCP: ఒకప్పుడు హవా ఉన్న నియోజకవర్గాల్లో… ఇప్పుడు వైసీపీ మౌనం..
ఏపీలో (Andhra Pradesh) రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి బలమైన స్థావరాలు గా ఉన్న కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. ఆ పార్టీకి ఉన్న కేడర్ (Cadre) ఉత్సాహం తగ్గిపోవడంతో పాటు, నాయకుల ప్రభావం కూడా కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత పలు ప్రాంతాల్లో వైసీపీ (YSRCP)కి చెందిన నేతలు, కార్యకర్తలు పూర్తిగా వాయిస్ లెస్ (Voice-less) అయిపోయారు.
ఇప్పటివరకు అధికారంలో ఉన్నంత కాలం, ఆ నియోజకవర్గాల్లో వైసీపీ హవా కనిపించేది. కానీ ఓటమి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు ఎవ్వరూ ఎదురు మాట్లాడలేని స్థాయిలో ఉన్న నాయకులు ఇప్పుడు రాజకీయంగా వెనుకంజ వేశారు.పల్నాడు జిల్లాలోని (Palnadu District) మాచర్ల (Macherla) నియోజకవర్గం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy)కి పెద్ద ఎత్తున ప్రభావం ఉండేది. పిన్నెల్లి సోదరుల ఆధిపత్యం పెరిగింది కాబట్టి అధికారులు కూడా వారిని ఎదుర్కొనడం భయపడేవారన్న మాటలు అప్పట్లో వినిపించాయి. టీడీపీ (TDP) నేతలు, కార్యకర్తలు కూడా ఆ భయంతో కొంతకాలం స్థానిక రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. పిన్నెల్లి సోదరులు కేసుల సమస్యల్లో చిక్కుకోవడంతో వారి ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది.
మరోవైపు గుంటూరు జిల్లాలోని (Guntur District) మంగలగిరి (Mangalagiri) నియోజకవర్గం ఒకప్పుడు వైసీపీ బలంగా ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) ప్రభావం అధికంగా ఉండేది. ఆయనతో ఉన్న వర్గం బలంగా పనిచేసేది. కానీ ఎన్నికల ముందు జరిగిన మార్పులు, పార్టీ అంతర్గత విభేదాలు వైసీపీ స్థితిని క్షీణింపజేశాయి. ఇప్పుడు అక్కడ వైసీపీ జెండా పట్టే కార్యకర్తలు కూడా కనిపించడం లేదు.
తిరుపతి జిల్లాలోని (Tirupati District) చంద్రగిరి (Chandragiri) నియోజకవర్గంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskar Reddy) , ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి (Mohith Reddy) దాదాపు దశాబ్దం పాటు ఆధిపత్యం చెలాయించారు. కానీ అక్రమ మద్యం కేసులలో పేరులు రావడం, టీడీపీ తిరిగి బలపడడంతో అక్కడ వైసీపీ పరిస్థితి బలహీనమైంది.
గుడివాడ (Gudivada)లో కొడాలి నాని (Kodali Nani) పేరు ఒకప్పుడు రాజకీయ చర్చల్లో మార్మోగేది. ఆయన 25 సంవత్సరాలుగా కొనసాగించిన హవా ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. అలాగే గన్నవరం (Gannavaram) వంటి ప్రాంతాల్లో కూడా వైసీపీ ప్రభావం కనిపించడంలేదు. ఇలా చూస్తే దాదాపు 30 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకుల ప్రభావం తగ్గిపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఓటమి తర్వాత మానసికంగా దెబ్బతిన్న కేడర్ మళ్లీ ఎలా పుంజుకుంటుందో చూడాలి. ప్రస్తుతం మాత్రం ఒకప్పుడు బలంగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీ వాయిస్ కనపడకపోవడం ఆ పార్టీకి పెద్ద సవాలుగా మారింది.






