తిరుమల శ్రీవారి దర్శనానికి కార్యాచరణ సిద్ధం
తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోసం కోట్లాదిమంది శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మొదలైన తరువాత భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తుల రాకపై టీటిడి నిషేధం విధించింది. సుమారు 50 రోజులుగా స్వామివారి దివ్య దర్శనం భక్తులకు కరవైంది. స్వామివారికి ఆర్జిత సేవలు పుజలు నిత్య కైంకర్యాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా దేశంలోని ఏ ఆలయం కూడా తెరవలేదు. దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలు మూసేసారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం లాక్ డౌన్-4లో తిరుమల వెంకన్న భక్తులకు దర్శనాలకు అనుమతించే దిశగా టీటీడీ కార్యాచరణ సిద్ధం చేసింది.
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత భక్తులకు దర్శనం కల్పించడంపై టీటీడీ కసరత్తు చేసింది. అందులో భాగంగా నిత్యం 14 గంటల పాటు భక్తులను దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. ఒక్క గంటకు 500 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. దీంతో రోజూకీ ఏడు వేల మంది మాత్రమే దర్శనానికి పరిమితం కానున్నారు. అయితే మొదటి మూడు రోజుల పాటు టీటీడీ ఉద్యోగులను మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం తిరుమల తిరుపతిలో ఉన్న స్థానికులను ప్రయోగాత్మకంగా 15 రోజుల పాటు అనుమతించేందుకు టీటీడీ యోచిస్తోంది.
దర్శనానికి ఆన్ లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట సర్వదర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మాత్రమే భక్తులకు టీటీడీ అందుబాటులో ఉంచనుంది. ఈ టికెట్లు పొందిన భక్తులను మాత్రమే అలిపిరి వద్ద అనుమతిస్తారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించబోయే టీటీడీ పాలక మండలి సభ్యుల సమావేశంలో ఈ ప్రణాళిక ఆమోదం పొందే అవకాశం ఉందని ఆ వెంటనే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటివరకు దీనిపై ఇప్పటి దాకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ.. జూన్ 1వ తేదీ లేదా ఆ తరువాత ఓ శుభ ముహూర్తాన శ్రీవారి ఆలయాన్ని భక్తుల సందర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ప్రయోగాత్మకంగా పరిశీలన పూర్తయిన తర్వాత అంచెల వారీగా చిత్తూరు జిల్లా వాసులు అనంతరం రాష్ట్రవ్యాప్తంగా భక్తులను అనుమతించాలని టీటీడీ భావిస్తోంది.






