Tirumala: వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు : బీఆర్ నాయుడు
వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) తెలిపారు. తిరుమల (Tirumala)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని చెప్పారు. మొదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ లక్కీడిప్ ద్వారా టోకెన్లు కేటాయించాం. మిగతా ఏడు రోజులు సామాన్య భక్తులకు టోకెన్లు లేకపోయినా సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టిసారించాం. భక్తుల రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఏర్పాట్లు, సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. దాత మంతెన రామలింగరాజు (Mantena Ramalingaraju) సహకారంతో పీఏసీలను అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతాం. ఇటీవల రూ.9 కోట్లు విరాళంగా ఆయన అందించారు. ఆలయ ధ్వజస్తంభాల కోసం 100 ఎకరాల్లో టీడీపీ స్వయంగా దివ్య వృక్షాలను పెంచాలని భావిస్తోంది. పలమనేరు (Palamaneru) లో టీటీడీ గోశాల ఆవరణ వృక్షాల పెంపుదలకు అనువైన స్థలంగా గుర్తించాం. మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరుగుతుంది. 50 అజెండా అంశాలపై చర్చిస్తాం. దివ్య వృక్షాల ప్రాజెక్టుపై పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తాం అని తెలిపారు.






