Supreme Court: ఏపీ అధికారులపై అవినీతి కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మంది ప్రభుత్వ అధికారులకు సుప్రీంకోర్టులో (Supreme Court) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వారిపై గతంలో నమోదైన కేసులను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఏసీబీ (ACB) దర్యాప్తు కొనసాగించేందుకు పచ్చజెండా ఊపింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ సతీశ్చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
2016-2020 మధ్య కాలంలో ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై పలువురు అధికారులపై విజయవాడ ఏసీబీ సీఐయూ (CIU) కేసులు నమోదు చేసింది. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయానికి సీఐయూను పోలీస్ స్టేషన్గా నోటిఫై చేయలేదని, సాంకేతిక కారణాలతో ఆ కేసులను రద్దు చేయాలని కోరుతూ అధికారులు హైకోర్టును (High Court) ఆశ్రయించగా.. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హైకోర్టు తీర్పును సవాలు చేసిన ఏసీబీ.. సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది. చిన్న చిన్న సాంకేతిక కారణాలతో అవినీతి కేసుల దర్యాప్తును అడ్డుకోవడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పు న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ, దర్యాప్తు జరపాలని ఆదేశించింది. అయితే 6 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని, ఈ సమయంలో అరెస్టులు చేయకూడదని షరతు విధించింది. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక అంశాలపై పిటిషన్లను స్వీకరించవద్దని హైకోర్టులకు సూచించింది.






