Nellore: నెల్లూరులో మారుతున్న రాజకీయ పరిణామాలు .. నెక్స్ట్ మంత్రులు వీరేనా.
ఆంధ్రా రాజకీయాల్లో నెల్లూరు జిల్లా (Nellore District)ను రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతంగా చెప్పుకుంటారు. ఈ జిల్లాలో నుంచి ఎన్నో దశాబ్దాలుగా ప్రముఖ నేతలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అలాంటి జిల్లాలో ఇప్పుడు మరోసారి రాజకీయ వేడి పెరిగింది. ఏపీలో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం ఏర్పడి త్వరలో రెండేళ్లు పూర్తికాబోతుండటంతో, ఈ ఏడాది తప్పకుండా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ ప్రక్రియలో కొంతమంది ప్రస్తుత మంత్రులను తప్పిస్తారని, కొత్తవారికి అవకాశం ఇస్తారని జిల్లావ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది.
ఒకప్పుడు కాంగ్రెస్ (Congress), తరువాత వైసీపీ (YCP)కు బలమైన అడ్డాగా ఉన్న నెల్లూరు జిల్లాలో, తాజా ఎన్నికల్లో టీడీపీ కూటమి (TDP Alliance) పూర్తిస్థాయి ఆధిక్యత సాధించింది. పది అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ సీటును కూడా గెలుచుకుని జిల్లాలో రాజకీయ సమీకరణాలను తలకిందులు చేసింది. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీకి ప్రతికూల పరిస్థితులు ఎదురైన ఈ జిల్లాలో, ఈసారి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అందుకే ఈ విజయాన్ని నిలబెట్టుకోవాలన్న ఆలోచనలో కూటమి నేతలు ఉన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన తరువాత నెల్లూరు జిల్లా నుంచి సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramnarayana Reddy)కి మంత్రి పదవి లభించింది. ఆయనకు దేవాదాయ శాఖ (Endowments Department)ను కేటాయించారు. అయితే తన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మరింత కీలక శాఖ దక్కుతుందని ఆయన భావించినట్లు చెబుతారు. కానీ అలా జరగకపోవడంతో ఆయన రాజకీయ కార్యకలాపాలు కూడా పరిమితంగానే ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే విస్తరణలో ఆయనకు మళ్లీ అవకాశం దక్కడం కష్టమేనని జిల్లాలో చర్చ సాగుతోంది.
ఇక నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy). గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా చేసి మరీ కీలక శాఖ అప్పగించిన ఉదాహరణ ఆయనది. ఈసారి సర్వేపల్లి (Sarvepalli) నుంచి గెలిచి అసెంబ్లీలో ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కేబినెట్లో చోటు దక్కలేదు. కనుక ఈసారి అవకాశం వస్తే ఆయనకు మంత్రిపదవి ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఒకవేళ ఆయనకు అవకాశం ఇవ్వకపోతే, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నెల్లూరు రూరల్ (Nellore Rural) నేత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kothamreddy Sridhar Reddy) పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పటికే అర్బన్ ప్రాంతం నుంచి నారాయణ (Narayana) మంత్రిగా ఉండటంతో, ఒకే పరిధిలో ఇద్దరికి అవకాశం ఇస్తే ప్రాంతీయ సమతూకం దెబ్బతింటుందనే వాదన ఉంది.
ఈ పరిస్థితుల్లో మహిళా కోటా, సామాజిక సమీకరణలు అన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (Vemireddy Prasanthi Reddy) పేరు బలంగా వినిపిస్తోంది. కోవూరు (Kovur) నుంచి ఆమె సాధించిన విజయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకప్పుడు వరుస విజయాలు సాధించిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapureddy Prasanna Kumar Reddy)ను ఓడించి, అక్కడ టీడీపీకి బలమైన పునాది వేసిన ఘనత ఆమెదే. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో రెండో మంత్రి పదవి ఎవరికన్నది ఉత్కంఠగా మారింది. అయితే ఈ ప్రచారంలో ఆనం మళ్లీ మంత్రిగా కొనసాగడం కష్టమేనని మాట మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. ఇప్పుడు అంతా రాజకీయ నిర్ణయాలపై ఆధారపడి ఉంది.






