TDP vs YCP: ఏపీ లో మారుతున్న రాజకీయ గణాంకాలు.. ఇటు 10 అటు 20 మధ్య పోరు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు వ్యూహాల పోరు రగులుతోంది. ప్రతి పార్టీ తనదైన రీతిలో ఆలోచిస్తూ ముందుకు వెళ్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ (YCP) సొంతం చేసుకున్న 40 శాతం ఓటు బ్యాంకును తగ్గించడం కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. టీడీపీ (TDP) – జనసేన (Janasena) కలసి సాధించిన 50 శాతం ఓట్లలోనుంచి వైసీపీ కనీసం 20 శాతం అయినా దూరం చేస్తే సరిపోతుందని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో ఎవరి ఎత్తులు వారు వేస్తూ పోటీ వాతావరణం మరింతగా పెరుగుతోంది.
కూటమి ప్రధానంగా రెండు పాయింట్లను ఆయుధంగా మలుచుకుంది. ఒకటి పెట్టుబడులు, మరొకటి సంక్షేమ కార్యక్రమాలు. సీఎం చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) మరియు ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఎక్కడికెళ్లినా రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులను ప్రస్తావిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థిక స్థితి బలపడుతుందని చెబుతూ ఆ అంశాన్ని ప్రధానంగా ముందుకు తెస్తున్నారు. అదే సమయంలో, జనసేన కూడా ప్రజలతో నేరుగా కలవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వారు పెట్టుబడులపైనే కాకుండా, సంక్షేమ పథకాలపై కూడా ప్రస్తావనలు చేస్తూ కూటమి వైపు ఓటర్లను ఆకర్షించాలన్న ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు, వైసీపీ మాత్రం కొంచెం భిన్నంగా అడుగులు వేస్తోంది. పెట్టుబడులు, అభివృద్ధి అనే అజెండాకి బదులుగా కూటమి వ్యతిరేకతనే తమ ప్రధాన అస్త్రంగా మలుచుకోవాలని నిర్ణయించుకుంది. ప్రజలలో కూటమిపై ప్రతికూల వాతావరణం సృష్టిస్తే, తనకు ఓటు శాతం తగ్గే అవకాశం ఉండదని ఆ పార్టీ భావిస్తోంది. కానీ ఈ వ్యూహం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందన్నది ప్రచార శైలిపైనే ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం వైసీపీ లోపలే కొంతమంది నేతలే, ప్రజలతో మమేకం కాకపోతే పరిస్థితులు మారవని, ఎప్పటికప్పుడు వారితో దగ్గరగా ఉండాల్సిందేనని అంటున్నారు. కానీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) మాత్రం ఎన్నికలకు ముందు వరకు నిశ్చింతగా వెయిట్ చేసే సంకేతాలు ఇస్తున్నట్టు కనిపిస్తున్నారు.
కూటమి మరోవైపు మాత్రం స్పష్టమైన లక్ష్యంతో కదులుతోంది. వైసీపీ వద్ద ఉన్న 40 శాతం ఓటు బ్యాంకులో కనీసం 10 శాతం అయినా తమవైపు తిప్పుకోవడమే వారి ప్రయత్నం. అదే జరిగితే ఎన్నికల సమయంలో జగన్ బలం గణనీయంగా తగ్గిపోతుందని వారు భావిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు రంగాల్లో సమన్వయం కలిపి చూపిస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుందని వారి లెక్కలు.
మొత్తానికి, రాబోయే ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ పోరులో అసలు తేడా 10 నుండి 20 శాతం ఓటు బ్యాంకుపైనే ఆధారపడి ఉండబోతోంది. ఎవరు ఆ శాతం తమవైపు తిప్పుకుంటారో, ఎవరు దాన్ని కాపాడుకుంటారో అన్నదే ఈ పోరాటంలో విజయం నిర్ణయించబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.