Bhanakacherla Project: రాయలసీమ సాగు కలలపై తెలంగాణ అభ్యంతరాలు.. బనకచర్ల భవిష్యత్ ఏంటి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగు, తాగునీటి అవసరాల్ని తీర్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) ఎంతో ప్రాధాన్యతతో తీసుకువచ్చిన ప్రాజెక్ట్ బనకచర్ల (Bhanakacherla project) . ఆయన మాటల్లో ఇది రాష్ట్రానికి గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అని పలుమార్లు చెప్పారు. రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా సాగునీటిని అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తెచ్చారు. దీన్ని పూర్తి చేయడానికి సుమారు 81 వేల కోట్ల రూపాయల వ్యయాన్ని అంచనా వేసి, నిధుల సమీకరణలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
గోదావరి నదిలో ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసిపోయే వరద జలాల్లో కొన్ని వందల టీఎంసీలను రాష్ట్రానికి మళ్లించి వినియోగించాలన్నది బాబు కల. అందులోనూ కేవలం 200 టీఎంసీల నీటిని వాడగలిగితే రాష్ట్రం సాగు, తాగునీటి ఇబ్బందులన్నింటినీ అధిగమించవచ్చని ఆయన అభిప్రాయం. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభ దశ నుంచే తెలంగాణ రాష్ట్రం తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు మరియు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ల మధ్య సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో బనకచర్ల ప్రస్తావన రాలేదని రేవంత్ స్పష్టంగా వెల్లడించారు.
ఈ నేపథ్యంలో బనకచర్లపై కేంద్రం తన వైఖరిని వెల్లడించింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) అడిగిన ప్రశ్నకు స్పందనగా, బనకచర్ల ప్రాజెక్టును ఇంకా ప్రారంభించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాదు ప్రాజెక్టుకు సంబంధించిన ఎటువంటి అనుమతులు ఇప్పటి వరకు మంజూరు కాలేదని కేంద్రం స్పష్టంచేసింది. పైగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలను కేంద్రానికి లిఖితపూర్వకంగా పంపిందని సమాచారం.
ఇంకా గోదావరి పరివాహక రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh), మహారాష్ట్ర (Maharashtra) అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం తెలిపింది. మరోపక్క తెలంగాణ మాత్రం నికర జలాలు మాత్రమే కాక మిగులు జలాల , వరద జలలా పై కూడా వాటా కావాలని అంటోంది. మరి గోదావరి ఎగువ పరివాహక రాష్ట్రాలు కూడా ఇదే మాట అంటే అప్పుడు పరిస్థితి ఏంటి అన్న డైలమా లో ఏపీ ఉంది.ఈ పరిస్థితుల నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తవుతుందా? ఇన్ని అభ్యంతరాల మధ్య ముందుకు కదలగలుగుతుందా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రానికి ఎంతో అవసరమైన ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి అన్నది ఇప్పటికీ అనిశ్చితిగానే ఉంది.