Visakha Steel Plant: విశాఖ స్టీల్ భవిష్యత్తు చుట్టూ మళ్లీ రగులుతున్న రాజకీయాలు..

విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రైవేటీకరణ అంశం ఏపీలో (Andhra Pradesh) మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో కేంద్రం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆరోపణలు చేస్తుంటే, కూటమి నేతలు మాత్రం అలాంటి పరిస్థితి అసలు రాదని నొక్కి చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ప్రజల ముందే ప్లాంట్ అమ్మకం అసంభవమని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇటీవల స్టీల్ ప్లాంట్‌లోని కీలక విభాగాలు ప్రైవేట్ చేతులకు వెళ్తున్నాయన్న వార్తలు ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ (MP Sri Bharat) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గాజువాక (Gajuwaka) లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన కొంతమంది కార్మిక నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తన వద్దకు వచ్చి వేరేలా మాట్లాడుతున్నారని, బయటికి వెళ్లి తన మాటలను వక్రీకరిస్తూ అపప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం కార్మిక సంఘాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అంతేకాదు, కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల్లో పెద్దఎత్తున డబ్బులు వసూలు చేశారని సంచలన ఆరోపణలు కూడా చేశారు. నిజాయితీ లేని నేతల ఆటతీరు కార్మికుల మేలు కోసం కాదని, వారు కేవలం రాజకీయ లాభం కోసం పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు అలాంటి వారిని తిరస్కరించాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
ఇక కేంద్రం నుంచి ఇప్పటికే రూ.11 వేల కోట్లకు పైగా నిధులు సమకూర్చిన విషయాన్ని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ మొత్తం ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి కేటాయించారని చెబుతున్నారు. అయితే ఉద్యోగులు మాత్రం మరో ప్రశ్నను లేవనెత్తుతున్నారు. నిజంగా అభివృద్ధే లక్ష్యం అయితే సొంత గనులు ఎందుకు కేటాయించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే 32 విభాగాలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించారని వారు గుర్తు చేస్తున్నారు.
వైసీపీ (YCP) మాత్రం కూటమి నేతలపై నిప్పులు చెరుగుతోంది. ప్రైవేటీకరణ జరగదని చెప్పడం మోసం అని, ఇప్పటికే దశలవారీగా ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగిస్తోన్న సాక్ష్యాలను చూపిస్తోంది. మరోవైపు టిడిపి (TDP) వర్గాలు మాత్రం వైసీపీ ముసుగులో కొంతమంది కార్మిక నేతలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఉద్యోగుల అనుమానాలు, కూటమి హామీలు, వైసీపీ ఆరోపణలు అన్నిl కలిసిపోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు ఉద్యోగుల భయాలు, మరోవైపు రాజకీయ పార్టీలు చేసుకుంటున్న విమర్శలు ఈ అంశాన్ని మరింత క్లిష్టం చేస్తున్నాయి. చివరికి ఈ ఉద్యమం ఏ దిశలో సాగుతుందో చూడాల్సి ఉంది.