ఎపి సిఎం చంద్రబాబును కలిసిన తానా బృందం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి అభినందనలు తెలియజేశారు. వెలగపూడిలోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో తెదేపా విజయం కోసం పనిచేసిన ప్రవాసాంధ్రులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. అమెరికాలోని తెలుగు సంఘాల శక్తి సామర్థ్యాల్ని విరివిగా వినియోగించగలిగే ఒక సమగ్ర నివేదికను రూపొందించేందుకు ప్రభుత్వం సంసిద్ధమై ఉందని వారికి హామీ ఇచ్చారు. చంద్రబాబును కలిసిన వారిలో తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, మాజీ అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, తానా చికాగో తెలుగు సంఘం ప్రతినిధి రవిచంద్ర అనుమాల, తానా న్యూయార్క్ ప్రతినిధి వంశీ వాసిరెడ్డి తదతరులు ఉన్నారు.







