Mithun Reddy: కలకలం రేపుతున్న లిక్కర్ కేసు.. మిథున్ రెడ్డి 14 రోజుల రిమాండ్..

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy)ని శనివారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు మరింత ఉత్కంఠ కలిగించే దశకు చేరింది. ఆయనను అరెస్ట్ చేసిన మరుసటి రోజు ఆదివారం ఏసీబీ కోర్టుకు (ACB Court) హాజరుపరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
వివరాల్లోకి వెళ్తే, సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన అనంతరం ముందుగా విజయవాడ (Vijayawada) ప్రభుత్వాసుపత్రికి (Government Hospital) తరలించారు. అక్కడ బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించగా, ఆయన ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. తదనంతరం ఆయనను కోర్టులో హాజరు పరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ తీర్పుతో మిథున్ రెడ్డిని రాజమండ్రి (Rajahmundry) సెంట్రల్ జైలు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జైలుకు తరలించే సమయంలో భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు మధ్య ఆయన్ను జైలుకు తీసుకెళ్లనున్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్రపై సిట్ ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఆయనను A4 నిందితుడిగా పేర్కొన్నారు. శనివారం విచారణ సందర్భంగా సుమారు ఆరు గంటలపాటు ఆయన్ను అధికారులు ప్రశ్నించారు. అనంతరం అధికారికంగా అరెస్ట్ చేసి, రిమాండ్ కోరుతూ కోర్టుకు తీసుకెళ్లారు.
ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ (YCP ) నేతలు, మాజీ అధికారులు ఆరోపణలతో ఎదురవుతున్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్‌తో ఈ కేసు తీవ్రత మరింత పెరిగింది. రాజకీయంగా ఇది వైసీపీకి ఎదురుదెబ్బగా మారుతుందా లేదా అనేది మరికొద్ది రోజులలో తేలనుంది. మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశముందని సమాచారం. ఇక ఈ విషయంలో దర్యాప్తు సీరియస్ గా జరిపేలా సిట్ వేగం పెంచినట్టు తెలుస్తోంది.