Jagan: పని చేసే వారికే ప్రాధాన్యత, మిగిలినవారికి గుడ్‌బై..వైసీపీలో జగన్ కొత్త వ్యూహం..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ప్రస్తుతం ఒక కీలక దశను ఎదుర్కొంటోంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా వరకు సైలెంట్ అయిపోయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) పార్టీని తిరిగి బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా కొంతమంది నేతలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. గతంలో అధికారంలో ఉన్న సమయంలో చాలామందికి పదవులు ఇచ్చినా, ప్రస్తుతం ఆ నేతల ప్రాధాన్యం తక్కువైపోయిందని పార్టీలో చర్చ జరుగుతోంది.
ఒకప్పుడు జగన్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, మిత్రులకు పదవులు కేటాయించడంలో వెనుకాడలేదు. అయితే ఇప్పుడు పార్టీ విపక్షంలోకి వెళ్లిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పదవులు పొందిన చాలామంది నేతలు మౌనంగా ఉండిపోవడం, పార్టీ కార్యక్రమాల్లో కనిపించకపోవడం జగన్‌కు ఓ గుణపాఠం నేర్పినట్టు అంటున్నారు. అసలు పార్టీకి నిజమైన అవసరంలో ఎవరు పని చేస్తున్నారు, ఎవరు వ్యవహారానికి దూరంగా ఉన్నారు అనే విషయాన్ని గుర్తించేందుకు జగన్ స్వయంగా పరిశీలన చేపట్టినట్టు సమాచారం.
ఇప్పుడిప్పుడే పార్టీ పునరుద్ధరణ వైపు అడుగులు వేస్తున్న జగన్, ఇకపై వయస్సు , బంధుత్వం కాకుండా పని చేసే సామర్థ్యం, ప్రజల్లో ఉనికిని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారట. మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) కు గుంటూరు వెస్ట్ (Guntur West) బాధ్యతలు అప్పగించడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా పార్టీకి బలంగా నిలిచే వారికి మాత్రమే భవిష్యత్తులో అవకాశాలుంటాయని సంకేతాలు ఇస్తున్నారట.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరొక ఆసక్తికర విషయం ఏంటంటే, కొంతమంది నేతలు గోడ మీద పిల్లుల్లా వ్యవహరిస్తున్నారని సమాచారం. పార్టీకి అనుకూల వాతావరణం ఉంటే పార్టీలో కొనసాగాలని, లేదంటే మరో దారి వెతుకుందామని ఆలోచించే నేతలను జగన్ ముందే గుర్తించి, వీరికి ప్రత్యామ్నాయంగా నూతన నాయకత్వాన్ని తయారుచేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీకి విధేయతతో పని చేసే వారికే ప్రాధాన్యం ఉంటుందని ఆయన స్పష్టంగా చెబుతున్నారని సమాచారం. మరోపక్క టీడీపీ (TDP)లో యువతకు వచ్చే ఎన్నికల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. వైసీపీలో మాత్రం విధేయతే ముఖ్యమని జగన్ అనుసరిస్తున్న విధానం చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి, జగన్ వేసే కొత్త కొలమానాల ప్రకారం పార్టీలో ఎవరు నిలబడతారు, ఎవరు వెనక్కి తగ్గుతారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.