Pawan Kalyan: యువతకు ప్రాధాన్యం..జనసేన పునర్నిర్మాణం దిశగా పవన్ కళ్యాణ్..

జనసేన పార్టీ (Janasena Party) లో సమూల మార్పులు తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వేగంగా కదులుతున్నారు. గత నెల జరిగిన సేనతో సేనాని కార్యక్రమంలో ప్రకటించిన త్రిశూల్ వ్యూహంపై ఆయన ఇప్పుడు మరింత దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశమై కీలక సూచనలు చేశారు. పార్టీ అంతర్గత పరిస్థితులు, నాయకుల మధ్య ఉన్న విభేదాలు, వ్యవస్థలో ఉన్న లోపాలపై ఆయన నిశితంగా చర్చించినట్లు సమాచారం.
సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రధానంగా పార్టీ బలపరచడంపై దృష్టి పెట్టారు. సుదీర్ఘ కాలంగా పార్టీతో ఉన్నప్పటికీ గుర్తింపు దక్కని నేతలు, కార్యకర్తల గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని గుర్తించి వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అలాగే యువతను పెద్ద ఎత్తున పార్టీలోకి తీసుకురావడం, వారికి అవకాశాలు ఇవ్వడం జనసేన తదుపరి లక్ష్యమని పవన్ తెలిపారు. త్రిశూల్ వ్యూహంలో భాగంగా యువతకు నాయకత్వం ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సమావేశంలో పవన్ కళ్యాణ్ నేతల తీరుపై కూడా ఆవేదన వ్యక్తం చేశారు. “నేను వస్తేనే జనంలో ఉత్సాహం కనబడుతుంది, కానీ మీరు ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు ఆ ఉత్సాహం ఎందుకు కనిపించదు?” అంటూ ప్రశ్నించారు. నాయకులు తమ ప్రాంతాల్లో ప్రజలకు చేరువ కావాలని, కార్యకర్తల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని సూచించారు. పార్టీ బలపడాలంటే ప్రతి నాయకుడు స్వయంగా కృషి చేయాలని ఆయన హితవు పలికారు.
అసెంబ్లీ హాజరు, చర్చల్లో పాల్గొనే తీరుపై కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. కొందరు హోంవర్క్ లేకుండా సభకు వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సభలో ప్రజలకు సంబంధించిన అంశాలపై మాట్లాడే ముందు పూర్తి సమాచారం సేకరించాలని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలగకుండా వ్యవహరించాలని హెచ్చరించారు. ముందుగా నేతలతో కలసి సమావేశమై, తరువాత ఒక్కొక్కరితో విడిగా చర్చించడం ద్వారా పవన్ కళ్యాణ్ ప్రతి నాయకుడి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణ, ఐక్యత, పారదర్శకత అవసరమని ఆయన స్పష్టం చేశారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగడం ద్వారానే జనసేన ప్రజల్లో మరింత విశ్వాసం పొందగలదని పవన్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతం, క్రమశిక్షణ, యువత భాగస్వామ్యంపై పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయాలతో జనసేనలో మరో కొత్త దిశ కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన నూతన వ్యూహం — త్రిశూల్ ప్రణాళిక — ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం, సరికొత్త శక్తి స్ఫూర్తి లభించనుందని అంటున్నారు.