Phone Tapping: తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్

ఫోన్ టాపింగ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సంచలనంగా మారే సంకేతాలు కనబడుతున్నాయి. 2019 తర్వాత దీని గురించి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తెలంగాణలో అప్పట్లో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి(BRS) పెద్ద ఎత్తున ప్రతిపక్షాల ఫోన్లను టాపింగ్ చేసిందని ఆరోపణలు వినిపించాయి. ఏపీలో వైసీపీ కూడా ఈ విషయంలో భారత రాష్ట్ర సమితితో కలిసి పని చేసింది అనేది ప్రధానంగా వినపడిన ఆరోపణ. ఇక దీనిపై 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిగింది.
అయితే కొంతమంది అధికారులు అమెరికా పారిపోవడంతో విచారణ ముందుకు సాగలేదని చెప్పాలి. అయితే ఇప్పుడు విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు బయటకు వస్తున్న పేర్లు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్సార్ షర్మిల(YS Sharmila), ఆమె భర్త బ్రదర్ అనీల్, ఆమె సోదరి వైఎస్ సునితా రెడ్డి, ఆమె భర్త, కల్వకుంట్ల కవిత, వైఎస్ విజయమ్మ, టీడీపీ నేతలు గరికపాటి రామ్మోహన్ రావు, టీడీ జనార్ధన్, బిజెపి నేతలు సుజనా చౌదరి, సిఎం రమేష్, సహా పలువురు ప్రముఖుల ఫోన్లను టాప్ చేసినట్లు సమాచారం.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం వెయ్యి మంది ఫోన్లను టాపింగ్ చేశారట. నిత్యం హైదరాబాద్ తిరిగే ఆంధ్రప్రదేశ్ నాయకుల ఫోన్లను ఎక్కువగా టాపింగ్ చేసినట్లు గుర్తించారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న మీడియా సంస్థల జర్నలిస్ట్ ల ఫోన్లను కూడా టాపింగ్ చేసినట్లు తేలింది. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఫోన్లను టాపింగ్ చేసినట్లు సమాచారం. 2018 నుంచి 2023 వరకు ఈ వ్యవహారం నడిచినట్లు గుర్తించారు. తెలంగాణలో మొత్తం 650 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లను టాపింగ్ చేశారట. గచ్చిబౌలి కేంద్రంగా ఈ వ్యవహారం నడిచినట్టు గుర్తించారు. దీనిలో త్వరలోనే కీలక అరెస్ట్ లు ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.