TDP: ఏపీలో జాగృతమవుతున్న జనం.. నేతలను నిలదీస్తున్న వైనం..

ప్రస్తుతం ఎక్కడ చూసినా టిడిపి (TDP) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి సంబంధించిన జోష్ నడుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇది సజావుగా కొనసాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా ప్రారంభం కాలేదు. అయినా, ఇప్పటికే జరిగిన ప్రాంతాల్లో ప్రజలు తమ సమస్యలను నేరుగా నాయకులకు చెబుతున్నారు. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఇది గట్టిగానే నడుస్తోంది. గతంలో నేతలు వస్తే సమస్యలు చెప్పడానికి ప్రజలు ఆలోచించేవారు.. కానీ ఇప్పుడు మొహమాటమే లేకుండా మిమ్మల్ని ఎన్నుకుంది ఇందుకేనా అని నిలదీస్తున్నారు. తాజాగా టిడిపి నేత కేసినేని చిన్నికి (Kesineni Chinni) కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది..
విజయవాడ (Vijayawada) ప్రాంతంలో జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఉచిత బస్సు సదుపాయం (Free bus scheme) ఆగస్టు 15నుంచి మహిళలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అలాగే తల్లికి వందనం (Thalliki Vandanam) , గ్యాస్ పంపిణీ వంటి అంశాలపై కూడా చర్చించారు. అయితే, కొన్ని కాలనీల్లో మహిళలు కరెంట్ బిల్లుల గురించి తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. వారు చెప్పినదాని ప్రకారం, ఒకసారి వినియోగం రూ.500ల లోపే ఉండగా, బిల్లు మాత్రం రూ.1700 వరకూ వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై వారు ఎంపీని ప్రశ్నించగా, ఆయన ఇందుకు మునుపటి ప్రభుత్వమే దీనికి కారణం అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది మహిళలు “మీరు అధికారంలోకి వచ్చాక కూడా ఇదే కొనసాగుతుంటే ఎలా?” అంటూ తిరిగి ప్రశ్నించారు. దీనిపై ఎంపీ సమాధానం చెప్పకుండానే ఇతర కాలనీలోకి వెళ్లిపోయారు.
ఇంకో ఉదాహరణ గుంటూరు (Guntur) నియోజకవర్గం నుంచి వచ్చింది. కేంద్ర మంత్రి అయిన పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కూడా కరెంట్ బిల్లులపై మహిళల నుంచి ప్రశ్నలు వచ్చాయి. అయితే ఆయన స్పందన కాస్త శాంతంగా ఉండి, ప్రస్తుతం విద్యుత్ కొరత ఉన్న కారణంగా ఇది జరుగుతోందని వివరించారు. త్వరలోనే ఇది తగ్గుతుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భాల్లో ప్రజలు గతంతో పోలిస్తే చాలావరకు తమ చుట్టుపక్కల జరుగుతున్న విషయాలపై స్పష్టత కలిగిన వారిగా మారారని అర్థమవుతోంది. ప్రభుత్వం చేస్తున్న పథకాలను వారు విశ్లేషిస్తూ, ప్రయోజనం ఉంటేనే మద్దతు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలను మెప్పించాలంటే, వారు చేపట్టిన కార్యక్రమాలు నిజంగా ఉపయోగపడాలే తప్ప, మాటలకే పరిమితమైతే తిరస్కారమే ఎదురవుతుంది. పౌరులు ఇప్పుడు సమస్యలపై మౌనంగా ఉండకుండా గళం విప్పుతున్న పరిస్థితుల్లో, అధికార పార్టీలు మరింత జాగ్రత్తగా, ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.